మతిమరుపుకు గల కారణాలు ఏంటో తెలుసా?

0
43

ప్రస్తుతం చాలా మందిని వేధించే సమస్యల్లో ‘మతిమరుపు’ ఒకటి. అనుకున్న సమయంలో అవసరమైన విషయాన్ని మరిచిపోవడం, ఆ తర్వాత ఆ విషయం గుర్తుకురావడం ఇది తంతు. అయితే  వయసు మీద పడుతున్నకొద్దీ ఎంతో కొంత మతిమరుపూ వస్తుంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఇబ్బంది పడొచ్చు. లేదూ పాత విషయాలు గుర్తు రావటానికి కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు. మరి మతిమరుపుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వయసు
వయస్సు మీద పడుతున్నకొద్దీ మతిమరుపు ఎక్కువవుతూ రావొచ్చు. ఇది రోజువారీ పనులను దెబ్బతీసేలా కూడా మారొచ్చు. డిమెన్షియా రకాల్లో ప్రధానమైన అల్జీమర్స్‌ జబ్బు బారినపడుతున్న వారిలో 65 ఏళ్లు దాటినవారే ఎక్కువ. ఇందులో జన్యువులు మాత్రమే కాదు.. ఆహారం, వ్యాయామం, సామాజిక జీవనం.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి సమస్యలూ పాలు పంచుకుంటాయి.

పొగ తాగటం
పొగతాగే వారిలో విషయాలను గుర్తు పెట్టుకోవటానికి తోడ్పడే మెదడులోని భాగం దెబ్బతినే ప్రమాదముంది. అలాగే పొగ రక్తనాళాలను దెబ్బతీయటం కూడా డిమెన్షియాకు దారి తీయొచ్చు. పొగ అలవాటుతో పక్షవాతం ముప్పూ పెరుగుతుంది. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యటం మంచిది.

తలకు దెబ్బలు
ప్రమాదాల్లో తలకు దెబ్బలు తగలటం స్వల్పకాల జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపొచ్చు. అంతకుముందు రోజు చేసిన పనులు గుర్తురాకపోవచ్చు. విశ్రాంతి తీసుకోవటం, మందులు వేసుకోవటం ద్వారా త్వరగా కోలుకోవచ్చు. బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌ వంటి ఆటల్లో తరచూ తలకు దెబ్బలు తగలటం వల్ల మున్ముందు డిమెన్షియా ముప్పు పెరగొచ్చు. తలకు దెబ్బలు తగలటం వల్ల స్పృహ కోల్పోయినా, చూపు మందగించినా, తల తిప్పినా, తికమక పడుతున్నా, వికారంగా ఉన్నా వెంటనే ఆసుపత్రికి చేర్చాలి.