ప్రజెంట్ జనరేషన్ అతి శుభ్రతను(Over Hygiene) పాటిస్తోందనీ, దీనివలన అనారోగ్యం బారిన పడతారనే వాదన నిజం కాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చిన్నతనంలోనే కొన్ని రకాల సూక్ష్మ జీవుల ప్రభావం పడితే ఇమ్యూనిటీ పెరుగుతుందని, ఫలితంగా ఎలర్జిక్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యశాస్త్రంలో ఒక సూత్రం ఉంది. 21వ శతాబ్దంలో సమాజం అతి శుభ్రంగా ఉంటోందని, దీనివల్ల చిన్నారులు కొన్ని రకాల సూక్ష్మ జీవులకు దూరంగా ఉంటున్నారన్న భావన ఉంది. అందువల్ల ఎలర్జీలను ఎదుర్కొనే సామర్థ్యం వారికి తక్కువగా ఉంటోందని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. తాజాగా యూనివర్శిటీ కాలేజి లండన్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ కి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ఈ వాదనను కొట్టిపారేసింది.
రోగ నిరోధక, జీవక్రియ వ్యవస్థలు తగిన విధంగా సిద్ధం కావడానికి కొన్ని రకాల సూక్ష్మజీవుల అవసరమేనని వారు అంగీకరించారు. మన పేగులు, చర్మం, శ్వాస నాళాల్లో ఉండే సూక్ష్మ జీవులు మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలావరకూ అవి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, సహజ సిద్ధ వాతావరణం నుంచి వస్తాయి. అయితే గత 20 ఏళ్లలో పరిశుభ్రత విధానాలతో వాటికి దూరం అవుతున్నట్లు ఒక వాదన ఉంది. అది పూర్తిగా నిజం కాదని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ దిశగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ఆధునిక ఇళ్లలో ఉండే సూక్ష్మ జీవులు చాలావరకూ మన రోగ నిరోధక శక్తికి అవసరం లేనివే. మనం తీసుకునే టీకాలు, ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతోపాటు మన రోగ నిరోధక శక్తి((Immunity))ని బలోపేతం చేస్తాయి. అందువల్ల రోగ నిరోధక వ్యవస్థ సిద్ధం కావడం కోసం వ్యాధి కారక సూక్ష్మ జీవుల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని పరిశోధకులు వెల్లడించారు.
సహజ సిద్ధ హరిత వాతావరణంలోని సూక్ష్మ జీవులు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇళ్లలోని శుభ్రత(Hygiene), ఆరోగ్యం వంటివి అలాంటి సహజ సిద్ధ వాతావరణాన్ని మన నుంచి దూరం చేయలేవు. అతి శుభ్రత, ఆరోగ్య సమస్యలకు మధ్య సంబంధాన్ని నిపుణులు పలు సందర్భాల్లో గుర్తించిన మాట వాస్తవమే. అయితే అవి చాలావరకూ సూక్ష్మ జీవుల లేమి వల్ల ఉత్పన్నమైనవి కావు. శుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్లే ఇలా జరుగుతోంది. అందువల్ల ఇళ్ల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత మంచిదేనని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే పరిశుభ్రతకు సంబంధించిన రసాయనాలకు చిన్నారులు నేరుగా గురికాకుండా చూడాలని పరిశోధకులు సూచిస్తున్నారు.