కరోనా రోగులకు ఔట్ డేటెడ్ మెడిసిన్ : వరంగల్ లో నిర్వాకం

0
119

అసలే కరోనా సోకి బిక్కు బిక్కుమంటూ కాలమెల్లదీస్తున్న రోగులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్వాకం కొత్త ప్రమాదాన్ని కొనితెచ్చిపెడుతున్నది. వైద్య సిబ్బంది నిర్వాకంతో కరోనా రోగులకు ఔట్ డేటెడ్ మెడిసిన్ సరఫరా చేస్తున్నారు.

ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం, ఇల్లందలో జరిగింది. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా బాధితులకు కాలపరిమితి ముగిసిన మందుల పంపిణీ చేయటం కలకలం సృష్టించింది. ఒక వైపు గ్రామంలో 50కి పైగా పెరిగిన పాజిటివ్ కేసులతో బెంబేలెత్తుతున్నారు. మరో వైపు ఆరోగ్య కార్యకర్తల నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగింది.

ఇల్లంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు.. కరోనా బాధితులకు ఇలాంటి మందులు పంపిణీ చేయటం పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిన్న కరోనా బాధితురాలికి ఇచ్చిన విటమిన్ సి, డి టాబ్లెట్స్ ఇలా కాలపరిమితి ముగిసిపోయినవి ఇచ్చినట్లు గుర్తించిన బాధితురాలు ఫోటో దింపి సోషల్ మీడియా లో పోస్టు చేశారు.

ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే రోగాలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు భరోసా ఇవ్వాల్సిన ఆరోగ్య కార్యకర్తలు ఇలా కాలం చెల్లిన మందులు ఇచ్చి వారిని భయపెడుతున్నారని గ్రామస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల పని తీరు పై మెడికల్ ఆఫీసర్ కు పిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు గ్రామస్థులు.