చావునోట్లో తలపెట్టేసి వచ్చిన : కరోనాను జయించిన హెల్త్ బీట్ జర్నలిస్టు అనుభవం

Journalist Narendar wins corona

0
39

(కాజిపేట నరేందర్)

చాలా మందిలాగే నాకు కరోనా వచ్చింది. జ్వరం, కొద్దిగా దగ్గు, తలబరువుగా ఉన్నట్లుగా అనిపించడంతో వచ్చేసుంటుంది అనుకున్నా… లక్షణాలుండటంతో యాంటీజన్ టెస్టులో పాజిటివ్ గా తేలింది!

ఎలాగోలా 14డేస్ తగు జాగ్రత్తలతో హోం ఐసోలేషన్ పూర్తిచేసి మళ్ళీ అందరిలో కల్సిపోవచ్చనుకున్నా. కానీ… అనుకున్నది అడ్డం తిరిగింది! ఇంట్లో అప్పటికే ఇద్దరికి పాజిటివ్ రావడం, వాళ్ళకి తగ్గకముందే నాకు అంటుకోవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో మా అందరిని అర్సుకునేది మాలతి (నాభార్య) ఒక్కతే అయితే ..బెడ్స్ పై ఉన్నది ముగ్గురం. మరో ముగ్గురు నెగటివ్ ఉన్న వారి బాగోగులు చూసుకొనేది ఒక్కతేకావడంతో సమస్యలు స్టార్ట్ అయ్యాయి!

 

కట్ చేస్తే..ఎక్కువ లక్షణాలతో ఇబ్బంది పడుతూ, హోం ఐసోలేషన్ లో ఎక్కువ కాలం ఇబ్బందిపడింది నేనే కాబట్టి రిస్క్ నాతోనే ఉండేది. ఏ మాత్రం తినకపోవడం….జ్వరం,దగ్గు, బాగా ఒళ్ళు నొప్పులు ఉండటంతో డాక్టర్ల సూచనతో కోర్సు గా టాబ్లెట్స్ మొదలుపెట్టాను. Tab Dolo 650 రోజుకు మూణ్ణాలుగు పూటలు, Tab Doxycycline, విటమిన్ బి,సి,డి ఇలా ఇంకో ఐదారు బలం గోళీలతో ఇంట్లో ఐసోలేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా కానీ ఫలితం కనిపించడం లేదు. ఆయాసం, దగ్గు నెమ్మదిగా పెరగడంతో Ct chest స్కాన్ తీయాలని సూచించడంతో వెళ్లి చేయించాను. రిపోర్ట్ లో 5/25 రావడంతో అప్పటివరకు సాధారణ ట్రీట్మెంట్ జరిగినా..కాఫ్ రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గకపోవడంతో ఆక్సిమీటర్, బిపి మిషన్ కి పనిచెబుతూ, అలా డాక్టర్ల సూచనలు పాటిస్తూ 5 రోజులు నెట్టుకొచ్చాను. జ్వరం కాస్త తగ్గినా.. దగ్గు, నీరసం బాగా పెరగడంతో రెండో ప్రయోగం కింద డాక్టర్లు..Tab Fabiflu 800 mg6 days మొదలుపెట్టమన్నారు. మొదటిరోజే 1800 mg టాబ్లెట్స్ వేసుకోవాల్సిరావడం నరకం కనిపించింది. లైఫ్ లో ఇన్నిరోజులు ఇంట్లో పడుకోవడమే ఓ నరకం అనుకుంటే, ఎటూ చూసిన మళ్లీ టాబ్లెట్స్ కనిపిస్తుండటం,వాటి స్మెల్ భరించలేక, అన్నంకుడా తినబుద్దికాకపోవడంతో పక్కనే ఉండే మందులపై ఓ టవల్ కప్పేపరిస్థితి వచ్చింది.

 

ఇలా..కొద్దిరోజులు ‘ఫాబీ ఫ్లూ..తో మిగతా ఈ టాబ్లెట్స్

  1. Tab doxy 100 mg twice daily
  2. T. Ivermectin 12 mg once daily
  3. Tab dexa 4 mg after launch
  4. Tab Pan 40 mg once daily.
  5. Tab. Flumicil 600 mg twice daily.
  6. Tab A to Z once daily at night.
  7. T. Zu C 500 mg once daily ఇలా 5 days..దగ్గుకు ఓ మూడు సిరప్ లు వాడేసినా.ఏ మాత్రం తగ్గకపోవడంతో అప్పటినుంచి వంట్లో భయం తెలియకుండానే నెమ్మదిగా మొదలయ్యింది. ఒక పక్క మా అత్తను అప్పటికే హాస్పిటల్ లో అడ్మిట్ చేసిరావడం, తెల్సిన మీడియా మిత్రులతో పాటు బంధువులు ఒకొక్కరుగా చనిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తూనే ఉండటంతో టెన్షన్ మొదలైంది.

 

అసలు కష్టాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు వీడియో,ఆడియా కాల్స్ లో వైద్యులు సలహాలు ఇచ్చినా..దాదాపు 10 రోజులు కావస్తుండటంతో డైరెక్ట్ గా చూస్తేగాని ఏం చెప్పలేమని డాక్టర్స్ తేల్చేశారు. ఇప్పటికీ చాలా రకాల మందులు కంప్లిట్ చేశావ్. ఒకసారి హాస్పిటల్ దాకా వచ్చిపొమ్మని చెప్పడంతో…సాయంత్రం హడావుడిగా అప్పటికి వరకు తీయించుకున్న బ్లడ్ టెస్ట్, సీటి రిపోర్ట్ పట్టుకొని వెళ్లాలని డిసైడయ్యా. కానీ..ఒకపక్క లాక్ డౌన్, మరోపక్క బండి నడపలేని స్థితిలో ఎలా వెళ్ళేది అనుకుంటుండగా, టాక్సీ బుక్ చేయాలనుకున్న అవట్లేదు. ఎలాగోలా అయ్యిందని సంతోషపడే లోపే హాస్పిటల్ అని చెప్పడంతో కోవిడ్ పేషెంట్ అనుకొని ఒక్క సెకండ్ ఆగకుండానే కాల్ కట్ చేసేసాడు. మాలతి నేను డ్రైవ్ చేస్తా అంటే…స్లోగా నేనే వెళ్ళొస్తా అని నీరసంతోనే నెమ్మదిగా విజయ హాస్పిటల్ కి 15 ని. పోవాల్సిన దూరం కి 30 ని. నడపాల్సివచ్చింది. అప్పటికే మబ్బు పట్టిఉంది సికింద్రాబాద్ పోయే లోపే మధ్యలోనే వర్షం రానేవచ్చింది. ఒకపక్క జ్వరం, దగ్గు..బాగా నీరసం ఉండటంతో అలా అలా వర్షంలోనే తడుస్తూ నెమ్మదిగా దాటేసుకొని నేరుగా డాక్టర్ కృష్ణమూర్తి గారి దగ్గర వాలాను. చాలా బిజీగా ఉండే అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిపోర్ట్స్ తోపాటు హడావుడిగా ఆక్సీమీటర్ కూడా చూశాడు. ప్రత్యక్షంగా చూస్తేనగాని చెప్పను అన్నాడు కాబట్టి, ఆయన నోట్లోంచి ఏమి వస్తుందా అలా నీరసంగా ఎదురుచూస్తున్న. అంతలోపే మళ్లీ ct chest చేద్దాం అనడంతో మళ్లీ నా హెల్త్ పై నాకు టెన్షన్ పట్టుకుంది. కట్ చేస్తే..బాగా చీకటి పడుతోంది, ఆలస్యం చేయకుండా అక్కడే ఆ పని పూర్తిచేసి డాక్టర్ కి చూపించి ఇవ్వాళ క్లారిటీ తో ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. CT చేయించిన…రిపోర్ట్స్ కోసం wait చేస్తున్నాను. అంతలోపు ఆపుకోలేని దగ్గు, ఆపుకుందాం అనుకొన్న ఆగడంలేదు. మధ్యలో లేచి డస్ట్ బిన్ దగ్గరికి వెళ్లివస్తున్న. ఆ విషయాన్ని పక్కనే ఉన్న తోటి కోవిడ్ పేషెంట్స్ గమనిస్తున్నారు. కానీ వాళ్ళకి కాఫ్ లేదు కాబట్టేమో, నన్ను మరోలా చూస్తున్నట్టు ఫీల్ అవుతున్న.

 

మళ్లీ….కట్ చేస్తే, రిపోర్ట్స్ వచ్చాయని ల్యాబ్ అతను చెప్పగానే నీరసంగా నా శరీరం అమాంతం లేచి స్పీడ్ గా వెళ్ళి రిపోర్ట్ రూమ్ లోకి వెళ్ళి చెయ్యి చాచింది. పిలిచినా ఎంతసేపటికి ఇవ్వకపోవడంతో టెన్షన్ మరింత మొదలయ్యింది. హాస్పిటల్ లో అడ్మిట్ చేసే పరిస్థితి ఉందీ.. లేనిది చెప్పలేనని డా.అనడం, అంతలోనే డాక్టర్ అక్కడికివచ్చి..నా వైపు చూస్తూ ‘‘ఇంకా లేట్ చేయడం మంచిది కాదని కరాకండిగా చెప్పేశాడు. 8/25..ఉంది బట్ కాఫ్ చాలా ఉంది. నువ్ మనవాడివి కాబట్టి చెబుతున్న రిస్క్ తీసుకోకు’’ విషయం క్లియర్ గా చెప్పేశాడు. ఈ మొత్తం వ్యవహారం హాస్పిటల్ లో 3 గంటలుపట్టింది.

 

ఒకపక్క డాక్టర్ చెప్పిన మాటలు, కంటిన్యూగా కురుస్తున్న వర్షం, మధ్యమధ్యలో మాలతి కాల్ చేసి క్యాబ్ బుక్ అయ్యింది ఎలా వస్తవేమో నేను వస్తున్నా అనడం లాంటి ఘటనల మధ్య మళ్లీ ఒక్కడినే హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసిన. అప్పటికే రాత్రి 10 కావస్తోంది. నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన తోనే టైమ్ గడిచిపోతోంది. స్థోమత విషయం పక్కన పెడితే అంతటా ఒకటే వైద్యం. ప్రస్తుతం నా ముందున్న దారులు… 1గాంధీ, 2టీమ్స్ తప్ప మరోదారి కనిపించడంలేదు. నిమ్స్ లో కేవలం వైద్యసిబ్బంది,అధికారులతో బెడ్స్ మొత్తం నిండిపోయినట్టు తెల్సింది. ఇతరులకు ఖాళీ లేవు, ఉన్నా పెయిడ్ అని ఇప్పటికే చెప్పిఉన్నారు. అయినా మొదటి నుంచి నిమ్స్ తో ఉన్న కొద్దిపాటి పరిచయాలతో అందులోని ఒక్కలిద్దరికి నా విషయాన్ని షార్ట్ గా వాట్సాప్ లో చేరవేశాను. కానీ రెండు గంట దాటినా చూసుకోలేదు. ఏదో విషయం చెబితే నిద్రపోదాం అనుకున్న రావడం లేదు. ఒకపక్క కరోన తోనే నిద్రరావడం లేదు. బెడ్ కోసం..ఒకపక్క మెసేజ్ పెడుతూనే, సాచురేషన్ 92..94 టైంలో హాస్పిటల్ లో అడ్మిట్ అవసరముందా అనే విషయంపై పలువురు డాక్టర్స్ తో స్కాన్, హెల్త్ రిపోర్ట్స్ పంపి ఆరా తీసుకుంటున్న. వాళ్ళలోను మెజార్టీ జాయిన్ అవమని తేల్చేశారు. ఆ ఆలోచనలతో బుర్ర హీట్ అయ్యేలోపే కన్ను అంటుకుంది. తెల్లారి 7 గంటలకు లేచి ఫోన్ చూసేసరికి..నిమ్స్ డైరెక్టర్ మనోహర్ , నిమ్మ సత్యనారాయణ వాళ్ళ దగ్గరించి మెసేజ్ లు వచ్చాయి. నువ్వేమి ఆలోచించకు.., రమ్మని చెబుతూ బెడ్ ఇప్పించే ప్రయత్నంలో Rmo ను అటాచ్ చేశారు.

 

హమ్మయ్య అనుకొని..ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా మాలతి ని వెంటపెట్టుకొని నిమ్స్ లో వాలిపోయాను. సాచురేషన్ తక్కువగా ఆనిపించడం తో సిబ్బంది వచ్చి ఆక్సిజన్ పెట్టేసాడు. అంతలోనే అక్కడికి ఇద్దరు ముగ్గురు ఫోన్లు, 15 వేలు కట్టేసి అడ్మిట్ కమ్మని చెప్పడంతో మాలతి వెళ్ళివెంటనే పని పూర్తి చేసింది. కార్పొరేట్ లో అడ్మిట్ టైంలోనే లక్షలు గుంజుతుండగా, ఒకపక్క బెడ్ దొరకడంతో మాటలు రాలేదు. బ్లాక్ 4 లో కిటికీ వైపు నా బెడ్. నాకు అన్ని జాగ్రత్తలు చెప్పి భరోసాతో మాలతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాలో కొంత భయం, హాస్పిటల్లో ఇంతకాలం రాత్రి అనక, పగలనక న్యూస్ కవర్ చేశాను. నిమ్స్ లో అన్ని వార్డులు తిరిగినవాణ్ణే. కానీ అడ్మిట్ అయ్యాను కాబట్టి ఏదో గుండెల్లో అలజడి మొదలైంది. అందులోనూ కోవిడ్ వార్డు కావడంతో అందురు ppe కిట్స్ తో వస్తుండటంతో ఎవరితోనూ ఇష్టంగా మాట్లాడలేని పరిస్థితి. సాయంత్రం లోగా ఒక్కట్రెండు టాబ్లెట్స్ చేతిలోపెట్టి వెళ్లిపోయారు. కోవిడ్ రూమ్ కి బాగా తెల్సిన డా. గంగాధర్ సార్ రానేవచ్చేశారు. పీపీఈ కిట్ లో లేకపోవడంతో గుర్తుపట్టేసి ఇద్దరం 5 నిమిషాలు మాట్లాడుకొన్నాం. ఏం కాదు అని సార్ కూడా భరోసా ఇవ్వడం, సాయంత్రం లోగా రేమిడిసివిర్ స్టార్ట్ చేదాం అని చెప్పి వెళ్లిపోయారు. చెప్పినట్లుగానే ఫస్ట్ డోస్ మొదలుపెట్టడం, రాత్రి లోగా డి dimer లాంటి బ్లడ్ టెస్ట్ లు కొన్ని చేసేయడంతో రోజు గడిచిపోయింది. ఆరోజు 13 వ తేదీ రాత్రంతా నిద్రపట్టలేదు. మరోపక్క అర్ధరాత్రి టైమ్ లో డోర్లు కొట్టుకుంటుండటం, ఓ హార్రర్ సినిమాలా భయం భయం గానే తెళ్లారిపోయింది. నెక్స్ట్ డే పొద్దున 6 కొట్టక ముందే నర్సులు, హౌస్ కీపింగ్ వాళ్ళ హడావుడి అంతా ఇంతకాదు. లేపి మరి blood samples, బీపీ, నెబ్లేజ్ చేసేశారు.. నర్సులు. ఈ దినచర్య కొన్ని రోజుల వరకు కొనసాగింది. ఆ నెక్స్ట్ రెండు రోజులు సాఫీగా నిద్రపట్టింది అనుకొనేలోపే…ఆ మరుసటి రోజు రాత్రి 1 గంట దాటాక..పక్క బ్లాక్ నుంచి బిగ్గరగా ఏడుస్తున్న శబ్దాలు. ఒక్కసారిగా మేల్కొని అటువైపు చూశాను. కాసేపయ్యక ఆగిపోయాయి.

 

“ఆ టైంలో నాలో నేనే అనుకుంటున్న… ‘‘ఎన్నో శవాలను చూశావ్, మార్చురీకి వెళ్లివచ్చావ్, ఎమర్జెన్సీ వార్డ్స్ లో నీ కళ్ళముందే ఎంతోమంది ప్రాణాలు పొంగ చూశావ్, ఎందుకు నీకు భయం అని”. ఆ తర్వాత తెల్సింది రాత్రి అనుకున్నది నిజమే అని… కోవిడ్ తో ఎవరో పోయారని. అయినా మిగతా ప్రైవేట్ తో పోల్చితే ఇక్కడ చనిపోయేది చాలా తక్కువని నాకు తెలుసు. ఇలా..ఏదో తెలియని భయం మధ్యలో (వార్డులో) ట్రీట్మెంట్ తీసుకున్నానే తప్ప అక్కడి వైద్య సిబ్బంది బాగా చూసుకున్నారు. ఆ మరుసటి రోజు. కొత్తనర్సు కావచ్చు క్యానుల సరిగ్గాపెట్టక ఊడిపోయి, చేయికంత రక్తం, మరోచోట ప్రయోగంతో చేయివాచిపోయింది. ఇక ఆరాత్రి పోయిన మా అక్క, బాపు గుర్తొచ్చారు. ఇలా 5 రోజుల్లో కొంత ఆరోగ్యం కుదుటపడింది. నెక్స్ట్ డే మార్నింగ్ డా.వచ్చి రేమిడిసివిర్ డోస్ లు పూర్తి అయ్యాయని చెప్పి, యోగ క్షేమాలు తెలుసుకొని..నీరసంగా ఉన్నా డోంట్ వర్రీ అని చెప్పి 6 వ రోజు డిచార్జీ చేశారు.

 

 

చివరగా…సాధారణంగా వంటలు బాగుంటేనే తినేదే అంతంత. అలాంటిది హాస్పిటల్ ఫుడ్ ఎలాగుంటుందో తెల్సు కదా.! నిమ్స్ వార్డు లోకి తెల్లరగానే వచ్చిన టీఫిన్ ని ఆత్రంగా విప్పి చూశాను. ఇడ్లి. సాంబార్…చాలా మంచివాసన వచ్చింది. చేతినిండా అప్పటికే కుచ్చిచుకున్న నొప్పులు, నీరసం నడుమ నెమ్మదిగా బాత్రూమ్ పోయిచ్చి, నాపక్క బెడ్..రెడ్డి తింటుండటం, నాకు అప్పటిదాకా లేని ఆకలి అతనిని చూస్తూ తినడంతోనే మొదలయ్యింది.! మధ్యాహ్నం కూడా ఆయన టైం లొనే తినడం మొదలుపెట్టాను. మాములుగా ఆఫీస్ దగ్గర 2 దాటితేనే ఆకలి..అలాంటిది 1 లోపే భోజనం కడుపులో పడుతుంది. దీంతో…విపరీతంగా శరీరంలో యాంటీ బయాటిక్స్, స్థిరాయిడ్స్ ఉండటంతో ఎలాగోలా నాల్గు ముద్దలు లోపలపడితే ఇంకా బలహీనంగా కాకుండా ఉంటుందని నోరుబాగలేకున్న..కళ్ళుమూసుకుని మింగేసేవాన్ని. మధ్య మధ్యలో నాయోగ క్షేమాలపై నర్సుల ఆరా. ట్రీట్మెంట్ లేనప్పుడు సెల్ ఫోన్ తో కాలక్షేపం. కానీ ఎప్పుడు ఎవరి వార్త వినిపిస్తుందో అని న్యూస్ చూడటం దాదాపు మానేసిన. సాయంత్రం వరకు ఆగిన కొద్దిసేపు అలా ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా మెస్సేజ్ లు. అందులో కోవిడ్ వచ్చినట్లు తెల్వడంతో చాలామంది ఫోన్ లో పరామర్శలు. ఫోన్ తో ఇబ్బందులు వస్తున్నాయని బంద్ చేసిన. వేరే టైంపాస్ లేక సోషల్ మీడియా, పెండింగ్ సినిమాలతో రోజులో చాలా గంటలు అలా గడిచిపోయాయి.

 

 

మొత్తంగా..ఇలా ఇంట్లోఐసోలేషన్ తీసుకొనే దగ్గర నుంచి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేవరకు ఫోన్ లోను, డైరెక్ట్ గాను స్పందించిన వైద్యులకు ఏమి ఇచ్చి రుణం తీసుకోగలను. ముందుగా…గాంధీ పల్మనాలజీ ప్రొఫెసర్…డా.కృష్ణమూర్తి గారు, నిమ్స్ పల్మనాలజీ హెచ్ ఓడి..డా.పరంజ్యోతి గారు, అ విభాగం డా. భాస్కర్ గారు, గాంధీ జెనరల్ మెడిసిన్ ప్రో.డా. త్రిలోక్ చంద్ గారు, డా.ప్రతిభాలక్మి గారు, లక్ష్మి భాస్కర్ గారు, మర్త రమేష్, డా. ప్రవీణ్, డా.రవిశంకర్, డా. సందీప్ బీబీఆర్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు.

ఇక నిమ్స్ లో…అడ్మిట్ అయిన దగ్గర నుంచి అన్ని విధాలుగా సహకరించిన డైరెక్టర్ మనోహర్ గారు, మెడికల్ సూపరెంటడ్ నిమ్మ సత్యనారాయణ గారు, నెఫ్రాలజీ హెడ్ గంగాధర్ సార్, నిమ్స్ స్టాఫ్ కు పేరుపేరునా ధన్యవాదాలు!

కరోన నుంచి బయటపడ్డానని తెలియజేసేందుకు, మీతో.. మళ్లీ ఇలా కల్సుకుంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నా! ఇంకా.. నీరసంగా ఉంది, బట్ స్నేహితులతో కష్ట సుఖాలను పంచుకుంటే బరువు దిగుతుంది అంటారుగా, అందుకే చాలా కాలం తర్వాత మీముందుకువచ్చాను. !

 

(రచయిత కాజిపేట నరేందర్ హైదరాబాద్ మీడియాలో హెల్త్ బీట్ రిపోర్టర్. ఆయన ఫేస్ బుక్ వాల్ నుంచి తీసుకున్న కథనం.)