కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఇప్పుడు భారత్ నుకలవరపెడుతున్నాయి. కర్ణాటక బెంగళూరులో ఇద్దరికి ఈ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఇప్పుడు రాజస్థాన్ జైపుర్‌లో కూడా ఒమిక్రాన్ వ్యాపించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల జైపుర్‌కు వచ్చిన ఓ కుటుంబానికి కరోనా సోకినట్లు నిర్ధరణ కావడమే ఇందుకు కారణం. మరి ఇది ఒమిక్రాన్ వేరియంటేనా అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి అగర్వాల్. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని తెలిపారు. అయితే, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదని అన్నారు.