Feeling Tired | ఆహారం తీసుకున్నా నీరసం తగ్గట్లేదా.. కారణాలు ఇవే కావొచ్చు..

-

Feeling Tired | నీరసం, నిస్సత్తువ.. ఆహారం తీసుకోకపోవడం వల్ల ప్రతి ఒక్కరినీ ఆవహిస్తాయి. కానీ కొందరికి మాత్రం ఆహారం తీసుకున్నా, శరీరానికి కావాల్సిన రెస్ట్ ఇచ్చినా ఈ నీరసం అన్నది తగ్గదు. ఆఖరికి ఆహారం తీసుకునే సమయంలో కూడా నీరసంగానే ఉంటుంది. ఆరోగ్యం అంతా బాగానే ఉన్నా ఈ నీరసం పదేపదే ఆవహిస్తుంటుంది. ఇది మన జీవనశైలిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.

- Advertisement -

ఈ సమస్య వల్ల మన రోజువారీ పనులు పెండింగ్ పడిపోతుంటాయి. మన ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ తగ్గిపోతాయి. ఏ పనినీ సక్రమంగా చేయలేం. ఈ పరిస్థితి చాలా చికాకుగా ఉంటుంది. అయితే దీనికి ఏదో అంతర్గత అనారోగ్యం కారణమని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఈ సమస్యకు చాలా వరకు మనం తీసుకునే ఆహారాలే కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి మనల్ని నిరంతరం నిస్సత్తువులో ముంచేసే, అలసిపోయేలా చేసే ఆ ఆహార అలవాట్లు ఏంటో ఒకసారి చూసేద్దామా..

స్వీట్స్: చక్కెర స్థాయిలు అధికంగా ఉండే పదార్థాలు అధికంగా తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందట. స్వీట్స్, స్వీట్ డ్రింక్స్, పేస్ట్రీలు వంటి తియ్యని పదార్థాలు తినడం వల్ల అందులో ఉంటే చక్కెర స్థాయిలు మన శరీరానికి తాత్కాలికంగా శక్తిని అందిస్తాయి. కానీ అలా అందిన శక్తి స్వల్ప కాలంలోనే ఖర్చవుతుంది. వెంటనే మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి.

మన రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను స్వీట్స్ వేగంగా పెంచుతాయి. ఆ తర్వాత అవి ఒక్కసారిగా పడిపోవడం వల్ల మన శరీరం తీవ్ర అలసట(Feeling Tired)కు గురవుతుందని చెప్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే స్వీట్లు తినడం కాస్త తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

కొవ్వు పదార్థాలు: డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, ఫ్యాటీ మీట్, ఫ్యాటీ మిల్క్‌లో కొవ్వు శాతాలు అధికంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి కొవ్వులు చాలా ముఖ్యం. కానీ ఈ కొవ్వు పదార్థాలను అధికంగా తినడం వల్ల ప్రతికూల ప్రభావాలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.

వీటిని అధికంగా తీసుకోవడానికి ఫలితంగా మనకు బద్దకంగా, అలసటగా అనిపిస్తుంది. ఈ ఆహారాలు ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఇందుకోసం శరీరం ఇతర శారీరక అవసరాల నుంచి శక్తిని మళ్లించి జీర్ణవ్యవస్థపై ఎక్కువ శక్తిని కేంద్రీకరిస్తుంది. దీని వల్ల మనకు నీరసంగా, నిస్సత్తువుగా అనిపిస్తుంది. ఇది మనకు మగతను కూడా కలిగిస్తుంది.

ఐరన్ తక్కువ ఆహారాలు: ఐరన్ మనకు చాలా ముఖ్యం. ఆక్సిజన్ మొత్తం శరీరానికి అందేలా చేయడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఈ ఐరన్ స్థాయిలు తగ్గినా సరే అలసట, నీరసం వంటి సమస్యలు వస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు, ఫాస్ట్ ఫుడ్, కొన్న తృణధాన్యాలు, శుద్ధి చేసిన ధాన్యాల్లో ఈ ఐరన్ తక్కువ పరిమాణాల్లో ఉంటుంది.

వీటిని తరచుగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కూడా ఐరన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. ఈ కారణంగా రోజంతా కూడా అలసటగా, నిస్సత్తువుగా ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే ఐరన్ అధికంగా ఉంటే బీన్స్, చిక్కుళ్లు, ఆకు కూరలు, బలవర్థకమైన తృణధాన్యాలు, లీన్ మాంసాలను మన డైట్‌లో చేర్చుకోవాలి.

మద్యం: ప్రస్తుత కాలంలో మద్యం సేవించడం అనేది చాలా కామన్ అలవాటులా మారిపోయింది. వంద మందితో తొంభై మంది మద్యం ప్రత్యేక సందర్భాల్లో అయినా సేవించే అలవాటు ఉన్నవారే అని నిపుణులు చెప్తున్నారు. మద్యం మన కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అది కాస్తా నిరుత్సాహానికి దారి తీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

మద్యం సేవించడం అనేది మన నిద్ర విధానాలను కూడా ప్రభావితం చేస్తుంది. మద్యం సేవించడం వల్ల నాణ్యతలేని విశ్రాంతి లభిస్తుంది. మద్యం ఎక్కువగా తీసుకోవడం.. తొలుత నిద్ర పోవడానికి ఉపయోగపడినప్పటికీ.. కాలక్రమేణా అది నీరసం, నిస్సత్తువకు కారణమవుతుందని వైద్యులు వివరిస్తున్నారు.

ఎనర్జీ డ్రింక్స్: ఈ పరుగుల ప్రపంచంలో ఎనర్జీ డ్రింక్స్ తాగడం సర్వసాధారణం అయిపోయింది. పని ఒత్తిడి వల్లో, మరే ఇతర కారణాల వల్లనో అధిక శాతం మంది టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్‌ను తాగుతుంటారు. వీటిని తాగిన కొద్దిసేపు చాలా యాక్టివ్‌గా పనిచేస్తారు కూడా. వీటిని తాగినప్పుడు తాత్కాలిక శక్తి లభిస్తుంది. కానీ వీటిని అధికంగా తాగితే మాత్రం మన నిద్రకు భంగం కలుగుతుంది. దాని కారణంగా అలసట, డిపెండెన్సీ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

శుద్ధి చేసిన ధాన్యాలు: తరచుగా వీటిని తినడం కూడా నిరంతర అలసటకు కారణమవుతుందని వైద్యులు అంటున్నారు. వైట్ రైస్, వైట్ బ్రెడ్, పాస్తా వంటి శుద్ధి చేసి ధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు తినడం మన శరీరానికి మేలు చేయవంటున్నారు. వీటిలో ఉండే ఊక, పోషకాలను తొలగిస్తారని, పిండి ఎండోస్పెర్మ్‌ మాత్రమే వీటిలో ఉంటుంది.

వీటిలో ఎటువంటి అవసరమైన పోషకాలు ఉండవు. వీటిని తినడం వల్ల మన రక్తంలోని చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ స్థాయిలు మళ్ళీ తగ్గుతాయి. ఇది కాస్తా అలసటకు కారణమవుతుంది.

ప్రాసెస్‌డ్ ఫుడ్స్: ప్రాసెస్ చేసిన ఆహారలు తినడం ప్రస్తుత సమాజంలో షరామామూలైపోయింది. చిన్న పిల్లలు సైతం ఈ ఫాస్ట్ ఫుడ్‌ను తినడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు.

వీటిలో అనారోగ్య కొవ్వులు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా తిన్న సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి, క్రాష్ చేయడానికి కారణమవుతాయి. దీని వల్ల మన శక్తి స్థాయిలు వేగంగా పడిపోతాయి. ఇది కాస్తా బద్ధకం, అలసటకు దారితీస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఈ ఆహారాలకు దూరంగా ఉంటూ.. ఆరోగ్యకరమైన డైట్‌ను మెయింటెన్ చేయడం ద్వారా ఎప్పుడూ నీరసంగా(Feeling Tired) ఉండటం అన్న సమస్యను దూరం చేసుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. అయినా ఈ సమస్య సమసిపోకపోతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Read Also: ఉల్లిపాయలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...