Hair Care Tips: నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం.. అందుకే చాలా అపురూపంగా చూసుకుంటాను. బ్రాండెడ్ షాంపూలు, కండీషనర్లు, సీరమ్‌లనే వాడుతాను అని చాలా మంది చెప్తూ ఉంటారు. జుట్టును సంరక్షించుకుంటున్నామన్న భ్రమలోనే జుట్టు రాలిపోవటానికి ఒక కారణం అవుతారు. అదెలాగా అని ఆశ్చర్యపోకండి. జుట్టుతో ఈ తప్పులు చేయకుండా ఉంటే.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఆ జాగ్రత్తులు ఏంటో తెలుసుకుందాం రండి…
కొందరు అతిగా తలస్నానం చేస్తూ.. బ్రాండెడ్ షాంపూలు జుట్టుకు రాస్తూ ఉంటారు. దీనివల్ల మెుదటికే మోసం వస్తుంది. బ్రాండెడ్ షాంపులు వాడినంత మాత్రాన జుట్టు ఊడటం ఆగిపోతుందనేది భ్రమ మాత్రమే. మెుదట ఏ షాంపూ మన జుట్టుకు సరిపోతుందో చూసుకొని వాడాలి. అతిగా తలస్నానం చేయటం వల్ల స్కాల్ఫ్‌లోని సహజంగా తయారయ్యే నూనెలు తొలగిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల స్కాల్ఫ్ పొడిగా మారి, జుట్టు కుదుళ్లు బలహీనంగా అయిపోతాయి.
వారానికి రెండుసార్లు తలకి స్నానం చేయటం ఉత్తమమని చెప్పుకోవాలి. తలకు స్నానం అనంతరం జుట్టు పట్టుకుచ్చులా ఉండేందుకు చాలా మంది కండీషనర్లు వాడుతుంటారు. కండీషనింగ్ చేయటం ముఖ్యమే కానీ.. కచ్చితంగా ఏవిధంగా కండీషనర్ అప్లై చేయాలో తెలుసుకోవటం అంతకంటే ముఖ్యం. కండిషనర్ కేవలం జుట్టుకు మాత్రమే రాయాలి.. స్కాల్ఫ్‌కు చేరకుండా చూసుకోవాలి.
సౌకర్యంగా ఉంది కదా అని ఎక్కువ మంది అమ్మాయిలు చేసే తప్పుల్లో ప్రథమమైనది జుట్టును ముడి పెట్టేయటం, లేదా పోనీటెయిల్‌గా గట్టిగా రబ్బర్ చుట్టేయటం. కానీ గంటల తరబడి జుట్టును ముడిలా ఉంచేయటం, బ్యాండ్లు పెట్టడం వల్ల జుట్టు మూలాలు బలహీనంగా మారి ఊడిపోతుంది. వదులుగా జుట్టును ఉంచే విధంగా చూసుకోవాలి.
తలకు స్నానం చేసి, తడి జుట్టును దువ్వేస్తుంటారు. అలా చేయటం జుట్టు ఆరోగ్యానికి హానికరం. జుట్టు విరిగిపోటానికి, జుట్టు అధికంగా రాలిపోవటానికి ఇదొక కారణం. జుట్టు సహజంగా ఆరే వరకు ఉన్న తరువాతే.. నెమ్మదిగా, స్మూత్‌గా తల దువ్వుకోవాలి. జుట్టుకు రంగులేయటం ఈ మధ్య ఫ్యాషన్‌గా మారిపోయింది. స్టైలింగ్ కోసం జుట్టును వేడి చేయటం వల్ల హెయిల్ లాస్ చాలా ఎక్కువుగా ఉంటుంది. అత్యవసరం అయితే తప్పా.. హెయిర్ కోసం హీట్ టూల్స్ వాడకండి.