ప్రస్తుత కాలంలో యువత మత్తు బారిన జీవితాలను చిత్తు చేసుకుంటుండగా.. ఎంబీ ఏచదివిన ఓ విద్యార్థి ఏకంగా గంజాయి సాగు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే జావేద్ అనే వ్యక్తి నెమ్మదిగా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. లాక్‌డౌన్ కాలంలో అవి సులువుగా లభించకపోవడంతో..తనే వాటిని తయారు చేయాలనుకున్నాడు. ఇంటినే పెరడుగా మార్చి..హైటెక్ పద్దతిలో ఇంట్లోనే గంజాయి పండించడం ప్రారంభించాడు. తనలానే ఇబ్బందిపడుతున్న మత్తుబాబులకు దాన్ని సరఫరా చేస్తూ భారీగా ఆర్జించాడు. ఏడాది కాలం నుంచి గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం కాస్త పోలీసులకు తెలిసిపోయింది. ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ హైటెక్ గంజాయి సాగు బెంగళూరులో చోటు చేసుకుంది.
కర్ణాటకకు చెందిన జావేద్ అనే వ్యక్తి బెంగళూరు కళ్యాణ్ నగర్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. కమ్మనహళ్లి ప్రాంతంలో నివసించేవాడు. ఈ క్రమంలో అతడు ఆధ్యాత్మికంవైపు మళ్లీ గంజాయికి అలవాటు పడ్డాడు. గత మూడు సంవత్సరాల నుంచి మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. తను తీసుకోవడమే కాక స్నేహితులను కూడా డ్రగ్స్‌కు అలవాటు పడేలా చేశాడు.
ఇలా సాగిపోతున్న సమయంలో గతేడాది బెంగళూరులో భారీ ఎత్తున మత్తుపదార్థాలు వెలుగు చూడటంతో భయపడిన జావేద్..కమ్మనహళ్లి ప్రాంతం నుంచి బిదాదికి మకాం మార్చాడు. ఆ ప్రాంతంలోని ఓ విల్లాలో మకాం పెట్టాడు. దాని రెంటే ఏకంగా 35 వేల రూపాయలు. ఇలా ఉండగా లాక్‌డౌన్ విధించడంతో డ్రగ్స్ లభించడం కష్టంగా మారింది. వాటికి బానిసైన జావేద్..మత్తుపదార్థాలు లభించకపోవడంతో పిచ్చివాడిగా మారాడు.
ఆ పరిస్థితి నుంచి బయటపడటం కోసం తన ఇంట్లోనే గంజాయి పెంచాలని భావించాడు. ఇందుకు గాను ఎల్‌ఈడీ లైట్లను అమర్చి హైడ్రోఫోనిక్ మోడల్‌ని సెటప్ చేశాడు. అనంతరం డార్క్ వెబ్ నుంచి గింజలను ఆర్డర్ చేశాడు. యూరోప్ నుంచి వాటిని పొందాడు. ప్రారంభంలో తన ఇంట్లో ఉన్న ఫిష్ ట్యాంక్‌లో ఓ విత్తనాన్ని నాటాడు. అది విజయవంతంగా పెరగడంతోమరిన్ని గింజలను నాటాడు.
ఇలా ఇప్పటి వరకు 130 మొక్కలను పెంచాడు. వాటి పెంపకం కోసం చాలా అధునాతనమైన పద్దతిని సెట్ చేశాడు. వాటిని మత్తుపదార్థంగా ఉపయోగించేలా తయారు చేశాడు. తన స్నేహితుల ద్వారా ఈ హైడ్రో గంజాయిని వినియోగదారులకు సరఫరా చేయడం ప్రారంభించాడు. ఒక్క గ్రాము గంజాయిని 3-4 వేల రూపాయలకు విక్రయించడం ప్రారంభించాడు.
రెండు రోజుల క్రితం క్రైం బ్రాంచ్ పోలీసులు డీజే హళ్లి ప్రాంతంలో మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా జావేద్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులు చెప్పిన అడ్రెస్ ప్రకారం పోలీసులు జావేద్ విల్లాలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్న హైటెక్ ఏర్పాట్లును చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురు డ్రగ్ పెడ్లర్స్‌ని..ఇద్దరు ఇరానియన్లను అరెస్ట్ చేశారు.