ఇండియాలో ఇప్పటివరకు రెండు వేవ్స్ కోవిడ్ రూపాలు చూశాము. తొలి వేవ్ లో పెద్దగా ఇండియన్స్ మీద వైరస్ ప్రభావం చూపలేకపోయింది. కానీ సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. కోట్ల మందికి సోకింది. లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. కోట్ల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. అయితే అతి త్వరలో మూడో వేవ్ అంటూ ఒకవైపు మీడియా ఊదరగొడుతున్న పరిస్థితుల్లో అసలు థర్డ్ వేవ్ అవకాశాలు ఇండియాలో తక్కువే అని ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయన పత్రం వెల్లడించింది.
ఒకవేళ మూడో వేవ్ ఇండియాలో వచ్చినా సెకండ్ వేవ్ అంత ప్రమాదకరంగా ఉండకపోవచ్చని వెల్లడించింది. ఇప్పుడున్న పరిస్థితులు, రాబోయే వైరస్ తీవ్రతను ఎదుర్కోవడంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇందుకు దోహదపడుతుందని తెలిపింది.
ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, వైద్య నిపుణులు సందీప్ మండల్, సమీరన్ పండా, లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ కు చెందిన నిమలన్ అరినమిన్ పతి సంయుక్తంగా రూపొందించిన ఈ అధ్యయనపత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో పబ్లిష్ అయింది.
రోగ నిరోధక శక్తి క్షీణించడం, రోగ నిరోధక శక్తిని తప్పించుకునేలా వైరస్ లో మార్పులు రావడం వంటి కారణాలు మూడో వేవ్ ఉధృతికి దారితీసే అవకాశాలు తక్కువేనని ఇందులో అభిప్రాయపడ్డారు. రెండు సందర్భాల్లోనే థర్డ్ వేవ్ రావడానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అవి ఏంటంటే…
1 కొత్త వేరియంట్స్ కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అదే సమయంలో అది రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలగాలి.
2 సంక్రమణాన్ని తగ్గించగలిగే లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయాలి. వస్తే గిస్తే ఈ రెండు కారణాల వల్ల మూడో వేవ్ రావొచ్చని, అలా వచ్చినా రెండో వేవ్ అంత ప్రమాదకరంగా ఉండకపోవచ్చని ఈ అధ్యయన పత్రం సారంశంగా చెబుతున్నారు.