చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. అయితే ఈ మహమ్మారి పీడ నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మంకీపాక్స్ మళ్ళి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో జనాలు కరోనా కొత్త కేసులు తగ్గుతున్నందుకు సంతోషపడాలో లేదా మంకీపాక్స్ విరుచుకుపడుతున్నందుకు బాధపడాలో తెలియని దుస్థితి ఏర్పడింది.
ఈ మంకీపాక్స్ బారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరిస్తుంది. ఎందుకంటే మంకీపాక్స్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూ అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మే 13 నుంచి జూన్ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో మొత్తంగా ఇప్పటివరకు మంకీపాక్స్ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు నమోదయ్యాయి. అందుకే శరీరంపై దద్దర్లు రాగా, దురద ఉన్నట్టు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.