మంకీపాక్స్‌ ముప్పు.. వెయ్యిపైగా కేసులు నమోదు

0
41

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. అయితే ఈ మహమ్మారి పీడ నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మంకీపాక్స్ మళ్ళి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో జనాలు కరోనా కొత్త కేసులు తగ్గుతున్నందుకు సంతోషపడాలో లేదా మంకీపాక్స్ విరుచుకుపడుతున్నందుకు బాధపడాలో తెలియని దుస్థితి ఏర్పడింది.

ఈ మంకీపాక్స్ బారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్ర‌పంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరిస్తుంది. ఎందుకంటే మంకీపాక్స్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతూ అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 29 దేశాలకు వైరస్‌ పాకిందని, వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసన్‌ పేర్కొన్నారు.

అందుకే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, అలసట, శోషరస గ్రంథులు వాపు, చర్మంపై దద్దుర్లు  ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. మంకీపాక్స్‌కు వ్యతిరేకంగా టీకాలు వేసే దేశాల్లో  ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, ఇతర ఆరోగ్య పరిస్థితుల్లో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులతో సహా బలహీన రోగనిరోధక శక్తి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు తెలిపారు.