తరుచూ సీటీ స్కాన్(CT Scan) చేయించుకోవడం వల్ల ప్రమాదమా? అంటే అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. సిటీ స్కాన్ ఎక్కువసార్లు చేయించుకోవడం వల్ల పిల్లలు, యువతలో బ్లడ్ క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోన్నట్లు ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మన శరీరంలో అంతర్గతంగా ఉండే సమస్యలను తెలుసుకునేందుకు ఉపయోగపడే అత్యాధునిక టెక్నాలజీ ఈ సిటీ స్కాన్. కానీ ప్రతి సీటీ స్కాన్ తో చిన్నారులు, యువత బ్లడ్ క్యాన్సర్(Blood Cancer) బారినపడే ప్రమాదం సుమారు 16 శాతం వరకూ పెరుగుతోందని యూరోపియన్ పీడియాట్రిక్ సిటీకి చెందిన పరిశోధకులు చేసిన రీసెర్చ్ లో వెల్లడైంది.
దాదాపు 10 లక్షల మంది రోగులపై వారు చేసిన అధ్యయనంలో సీటీ స్కాన్ల నుంచి వెలువడే రేడియేషన్ చిన్నారులు, యువతను క్యాన్సర్ ముప్పుకు గురి చేస్తోందని తేలింది. సీటీ స్కాన్ల నుంచి వెలువడే రేడియేషన్ మోతాదులకు బ్లడ్ క్యాన్సర్, ముఖ్యంగా లింఫాయిడ్, మైలాయిడ్ బారినపడే ముప్పునకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా సీటీ స్కాన్ లో వెలువడే రేడియేషన్ 10 నుంచి 15 యూనిట్లు అంత ప్రమాదకరం కాదని, అందరూ భావిస్తుంటారు. కానీ అంతకంటే తక్కువ స్థాయిల్లో వెలువడే రేడియేషన్ సైతం ప్రమాదకరమేనని వారు చెబుతున్నారు.
ఇపుడు సీటీ స్కాన్(CT Scan) చేయించుకునే ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో రానున్న 12 సంవత్సరాల్లో 1.4 క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అలాగని వ్యాధి నిర్ధారణలో, చికిత్స ప్రణాళికలో సీటీ స్కాన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనే విషయంలో ఎలాంటి వివాదం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అత్యవసర సందర్భాల్లో మాత్రమే సీటీ స్కాన్ చేయించాలని, దాని వల్ల రేడియేషన్ కి గురయ్యే ప్రమాదం తకువగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.