గాంధీలో అరుదైన శస్త్ర చికిత్స..పేషెంట్ కి చిరంజీవి సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు!

0
81

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ అరుదైన శస్త్ర చికిత్స చేశారు. రోగికి సినిమా చూపిస్తూ రోగి మెదడులోని కణితి(ట్యూమర్‌)ని తొలగించి అరుదైన రికార్డును సృష్టించారు. ఈ రకమైన సర్జరీని వైద్యపరిభాషలో అవేక్‌ క్రేనియటోమీ అంటారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, న్యూరోసర్జరీ హెచ్‌వోడీ డాక్టర్‌ ప్రకాశరావు, అనస్తీషియా వైద్యురాలు ప్రొఫెసర్‌ శ్రీదేవి తెలిపారు.

యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు అస్వస్థతతో ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చేరింది. న్యూరాలజీ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడులో ప్రమాదకరమైన రీతిలో కణితి(ట్యూమర్‌) పెరుగుతున్నట్లు గుర్తించారు. దీనితో శస్త్ర చికిత్స చేయాలనీ నిర్ణయించారు.

అయితే సర్జరీ చేస్తున్న సమయంలో ఫిట్స్, పెరాలసిస్‌తో పాటు పలు రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనితో ఆమెను స్పృహ కోల్పోకుండా ఉంచుతూ చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమాను కంప్యూటర్‌ ట్యాబ్‌లో చూపించారు. ఆమె సినిమా చూస్తుండగానే వైద్యులు సుమారు రెండు గంటలు తీవ్రంగా శ్రమించి మెదడులోని ఇతర భాగాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ట్యూమర్‌ను తొలగించారు.

తొలిసారిగా గాంధీ ఆస్పత్రిలో చేపట్టిన అవేక్‌ క్రేనియటోమీ సర్జరీ విజయవంతం కావడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన న్యూరోసర్జరీ, అనస్తీషియా వైద్యులు ప్రకాశరావు, ప్రతాప్‌కుమార్, నాగరాజు, శ్రీదేవి, సారయ్య, ప్రతీక్ష, అబ్బయ్య, పీజీలు కిరణ్, గిరీశ్, యామిని, స్ఫూర్తి, నర్సింగ్‌ సిబ్బంది రాయమ్మ, సవిన, రజిని, సుమ, వార్డ్‌బాయ్‌ నవీన్, వెంకన్నను వైద్యమంత్రి హరీశ్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, డిప్యూటీలు శోభన్‌బాబు, నర్సింహనేత, టీజీజీడీఏ గాంధీ యూనిట్‌ అధ్యక్షకార్యదర్శులు రాజేశ్వరరావు, భూపేందర్‌ రాథోడ్‌ తదితరులు అభినందించారు.