కొవిడ్​ సోకినా ఏం కాదు..ఏకైక బ్రహ్మాస్త్రం ఇదే!

this is the only Brahmastra!

0
122

మహమ్మారులు మనకేం కొత్త కాదు. శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లోనే కలరా, మశూచి, ప్లేగు లాంటివి మౌనవాళిపై పెనుదాడి చేశాయి. అప్పుడే వాటిని ఎదుర్కొన్నాం. ఇలాంటివి ఎన్ని వచ్చినా, సమర్థంగా ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం.. మనలో ఉండే రోగనిరోధక శక్తే! రోజూ కొద్ది సమయం కేటాయిస్తే దాన్ని పెంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే?

రోజుకు రెండున్నర లీటర్ల నీరు..

నీరు మంచి చేస్తుంది కాబట్టే మంచినీరు అంటాం. జీవక్రియలన్నింటికీ అదే ఆధారం.. దాహం వేసేవరకు ఆగకుండా అప్పుడప్పుడు కాస్త నోటిని తడుపుకోవాలి. రోజుకు కనీసం రెండున్నర లీటర్ల నీరు తాగాలి.

ఇంద్రధనున్సులా పళ్లెం..

ఇంటిని పలు రకాల రంగులతో అలంకరించుకుంటాం. ఒంటిమీద దుస్తులూ రంగురంగులవి వేసుకుంటాం. మరి మీరు తినే పళ్లెంలో ఎన్ని రంగులు ఉంటున్నాయి? ఎప్పుడూ ఒకే రకం కాకుండా. రకరకాల రంగుల కూరగాయలు, పండ్లతో మీ పళ్లెం ఇంద్రధనుస్సులా కళకళలాడిపోవాలి. అప్పుడే మీ ఒంటికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పదార్ధాలు అన్నీ అందుతాయి. రోజుకు 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తినాలి.

రోజూ ఒకే సమయానికి.

ఎప్పుడు పడితే అప్పుడు తినడం, పని ఉందన్న వంకతో అల్పాహారం, భోజనం మానేయడం అస్సలు సరికాదు. శరీరం, మెదడు పనిచేయాలంటే కావల్సిన శక్తినిచ్చేది ఆహారమే. రోజూ ఒకే సమయానికి తింటే.. జీవగడియారాన్ని పనిచేయించే జన్యువులు నియంత్రణలో ఉంటాయి.

కంటి నిండా నిద్ర..

నిద్రలోనే మన శరీరం మరమ్మతు చేసుకుంటుంది. నిద్రలేమితో నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. రోజూ తగినంతసేపు నిద్రపోతేనే అన్నీ సర్దుకుంటాయి.