కరోనా వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా శరవేగంగా జరుగుతోంది. లక్షలాది మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే అక్కడక్కడా కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్ని చిన్న చిన్న తప్పిదాలు జరుగుతున్నాయి. మొన్న ఒక మహిళకు రెండు డోసులు ఇచ్చిన నర్స్ ని చూశాం. ఇక మరో చోట ఇంజెక్షన్ సిరంజీ ఖాళీది శరీరం పై గుచ్చి టీకా వేసినట్లు భావించిన వారిని చూశాం. మరికొందరు టీకా వేయకుండా వేసినట్లు రికార్డు చేసిన ఘటనలు చూశాం.
తాజాగా మహారాష్ట్రలోని థానేలో ఓ మహిళకు అధికారులు ఒకేసారి మూడు డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారు. ఆనంద్ నగర్ లోని టీకా కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతో 28 ఏళ్ల మహిళకు కేవలం నిమిషాల వ్యవధిలోనే మూడు టీకా డోసులు వేశారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ లో ఆమె భర్త పని చేస్తారు, వెంటనే ఆయనకు ఈ విషయం చెప్పింది భార్య. దీంతో ఆయన అధికారులకి, కార్పొరేటర్ కు ఈ విషయం చెప్పాడు.
వెంటనే వైద్యులు ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. అయితే, తన భర్తది ప్రభుత్వ ఉద్యోగమని, ఘటనపై కేసు పెట్టనని ఆమె చెప్పింది. అయితే ఆమెకి ఈ వ్యాక్సిన్ ప్రాసెస్ గురించి తెలియదట. అందుకే ఇలా జరిగింది అని భర్త చెబుతున్నాడు. ఆ రోజు ఆమెకి తీవ్ర జ్వరం వచ్చింది రెండో రోజు తగ్గిందట.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలియచేశారు.టీకా కేంద్రాల్లో పనిచేసే అధికారుల నిర్లక్ష్యం గా ఉండద్దని చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఆ మహిళను గుర్తించకుండా మూడు సార్లు టీకా ఎలా వేశారు అనేది ఆశ్చర్యంగా ఉంది.