Alert: నిండు జీవితానికి రెండు చుక్కలు..నేడే పల్స్‌ పోలియో కార్యక్రమం

0
264

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. దీని కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో ఐదేళ్ల లోపు పిల్ల‌లంద‌రికీ ప‌ల్స్ పోలియో చుక్క‌ల‌ను పంపిణీ చేయ‌డానికి సిద్ధం అవుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 23,331 ప‌ల్స్ పోలియో కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 38,31,907 మంది ఐదేళ్ల చిన్నారుల‌కు ప‌ల్స్ పోలియో చుక్కలు వేయ‌నున్నారు. అయినా.. రాష్ట్ర ప్ర‌భుత్వం 50 ల‌క్షల‌కు పైగా ప‌ల్స్ పోలియో డోసుల‌ను సిద్దం చేసింది. సంచార జీవితం గ‌డిపే వారికి కూడా ప‌ల్స్ పోలియో అందించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అందుకు ప్ర‌త్యేకంగా బృందాల‌ను కూడా ఏర్పాటు చేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. 0-5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఏపీలో కూడా ముందు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయనున్నారు. అనంతరం రెండు రోజుల పాటు డోర్ టు డోర్‌ వెళ్లనున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలకు కచ్చితంగా పోలియో వేసేలా జాగ్రత్తపడాలని అధికారులు సూచించారు.