రష్యాపై స్విఫ్ట్ అస్త్రం? అదెలా పని చేస్తుందంటే..

Swift ax on Russia? That's how it works ..

0
38

ఉక్రెయిన్‎పై రష్యా యుద్దం ప్రకటించింది. దీనితో రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‎పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ యుద్ధంపై ప్రపంచ దేశాల నుంచి రష్యాకు తీవ్ర వ్యతిరేకతతో పాటు దాడి చేయొద్దని ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి మిగతా దేశాలకు స్విఫ్ట్’ ఒక పదునైన ఆయుధంలా కనిపిస్తోంది. అసలు ‘స్విఫ్ట్‌’ అంటే ఏమిటి? అదెలా పని చేస్తుంది? రష్యాపై స్విఫ్ట్ ప్రయోగిస్తే జరిగే నష్టం గురించి ఇప్పుడు చూద్దాం..

‘స్విఫ్ట్‌’ అంటే ఏమిటి?

సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ (స్విఫ్ట్-ఎస్‌.డబ్ల్యూ.ఐ.ఎఫ్‌.టి) అనేది ఒక అంతర్జాతీయ నగదు లావాదేవీల వ్యవస్థ. బెల్జియం ప్రధాన కేంద్రంగా పనిచేసే కన్సార్షియం ఇది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల మధ్య ఆర్థిక లావాదేవీగా పనిచేసే బెల్జియన్ కో-ఆపరేటివ్ సొసైటీ. SWIFT బ్రస్సెల్స్‌లో 1973న స్థాపించబడింది. ఇది CEO, కార్ల్ రాయిటర్‌చైల్డ్ నేతృత్వంలో ప్రారంభించడం జరిగింది. 15 దేశాలలో 239 బ్యాంకులచే మద్దతు ఇవ్వబడింది. దాని ప్రారంభానికి ముందు, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు టెలెక్స్ ద్వారా ప్రసారం చేశారు. ప్రపంచ ఆర్థిక ప్రవాహాలపై US నియంత్రణను తగ్గించే లక్ష్యంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది.

ప్రతిరోజు ప్రభుత్వాలు, సంస్థల మధ్య జరిగే లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలకు స్విఫ్ట్ సాక్షిగా వ్యవహరిస్తుంటుంది. స్విఫ్ట్‌ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం సగటున రోజుకు 4.20కోట్ల సందేశాలు వెళ్తున్నాయి. 2020లో ఈ రోజువారీ సగటు 3.80కోట్లు. అత్యంత విశ్వసనీయ వ్యవస్థ కనుకే నిత్యం రూ.లక్షల కోట్ల విలువైన లావాదేవీలకు ఇది కేంద్ర బిందువుగా మారింది. స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించాలని ఉక్రెయిన్, బ్రిటన్ గట్టిగానే పట్టబడుతున్నాయి. ఈమేరకు అమెరికాతో సహా అన్ని దేశాలపై ఒత్తిడికి తీసుకువస్తున్నాయి.

ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం..

మరోవైపు ప్రస్తుత పరిస్థితులపై వేచిచూసే ధోరణిని పాటిస్తున్నాయి ఈయూ దేశాలు. స్విఫ్ట్ నుంచి రష్యాను వెలివేస్తే తమ దేశంలోని బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపైనా ప్రభావం పడుతుందని పలు దేశాలు భయపడుతున్నాయి. నిషేధానికి గురైన రష్యాకు వస్తువులను ఎగుమతి చేసిన దేశాలు తమకు రావాల్సిన నగదు పొందటంలో ఇబ్బందులు పడతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. రష్యాను నిషేధిస్తే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రష్యా ఎగుమతుల్లో ప్రధాన భాగం ఆక్రమిస్తోంది క్రూడాయిల్. రష్యా వెలివేతతో బ్రెంట్ క్రూడాయిల్ ధర పెరుగుతాయని అంచనా.

స్విఫ్ట్‌ నిషేధిస్తే ఏం జరుగుతుంది?

ఒకవేళ రష్యా బ్యాంకులను స్విఫ్ట్‌ నిషేధిస్తే..అవి ప్రపంచ మార్కెట్లతో అనుసంధానాన్ని కోల్పోతాయి. రష్యన్లు, వారి కంపెనీలు దిగుమతులకు నగదు చెల్లింపులను సకాలంలో చేయలేవు. ఎగుమతులకు రావాల్సిన సొమ్మును అందుకోలేవు. రుణాలను పొందలేవు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టలేవు. అప్పుడు రష్యా బ్యాంకులు తమ చెల్లింపుల కోసం ఫోన్లపై, లఘుసందేశాల యాప్‌లపై, ఈమెయిల్స్‌ వంటి ప్రత్యామ్నాయాలపై ఆధారపడక తప్పదు. తమపై ఆంక్షలు విధించని దేశాలతో ఈ విధానాల్లోనే లావాదేవీలు కొనసాగించాల్సి వస్తుంది. నిర్వహణ వ్యయం కూడా అధికమవుతుంది.