అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. అరటి పండును పేదవాడి ఔషధాల గనిగా చెప్తారు ఆయుర్వేద నిపుణులు. అరటి పండు తింటే అన్ని రకాల పోషకాలు లభిస్తాయని, అనేక అనారోగ్యాలకు ఔషధంలా పని చేస్తుందని కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. బరువు పెరగడం, తగ్గడం, జీర్ణ సమస్యలు, రక్త సంబంధిత పలు సమస్యలు ఇలా మరెన్నో సమస్యలకు అరటి పండుతో చెక్ చెప్పొచ్చని అంటున్నారు. ఇది మన మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుందని, ఎనర్జీ బూస్టర్‌గా కూడా ఇది పనిచేస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. అరటి పండులో ఉండే అధిక గ్లూకోజ్ స్థాయిలు మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. మన కడుపు ఆరోగ్యానికి కూడా అరటి పండు ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ అరటి పండును రోజుకొకటి తింటే ఏమవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
తక్షణ శక్తి: అరటి పండు(Banana)ను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అందుకు ఇందులో ఉండే అధిక గ్లూకోజ్ స్థాయిలే కారణం. అందుకే చాలా మంది వ్యాయామం చేసే వారు తమ ప్రీవర్కౌట్ డైట్‌లో అరటి పండును చేర్చుకోవడానికి ఇష్టపడతారు.
కడుపు ఆరోగ్యం: అరటి పండులో ఫైబర్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కడుపు ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా దోహదపడతాయి. ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం వల్ల మన కడుపు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా పేగు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
గుండె పదిలం: అరటి పండులో పొటాషియం స్థాయిలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి మన గుండెను అనేక సమస్యల నుంచి కాపాడతాయి. ఇది మన గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఖనిజం కూడా. నెల రోజుల పాటు రోజూ ఒక అరటి పండు తింటే వారి గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండులో ఉండే విటమిన్ సీ.. మన మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది.
చర్మం: అరటి పండులో ఉండే మాంగనీస్ మన చర్మ ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-సీ మన చర్మానికి మెరుపును తెస్తుంది. దాంతో పాటుగా అరటి పండులో ఉండే బీ6 అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ అరటి పండు తినడం వల్ల మన చర్మం, గుండె, మెడదుతో పాటు మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి రోజూను ఫుల్ ఎనర్జీతో ప్రారంభిస్తామని వైద్యులు వివరిస్తున్నారు.