ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం. రాత్రంతా నిద్రలేని వారు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. నీరసం, బీపీ పెరగడం, కోపం, చిరాకు రావడం వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ప్రస్తుత జీవన శైలితో చాలా మందిని నిద్ర లేమి సమస్య వేధిస్తుంది. ఇంతకీ నిద్ర మనిషికి ఎందుకు అవసరం, ఏయే వయసులో ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు మనం చూద్దాం..
నిద్రలోనే మనిషిలో ఎన్నో హార్మోన్‌లు తయారవుతాయి. సరైన నిద్రపోక పోవడం వల్ల జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటులాంటివి పెరిగిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే తర్వాతి రోజు పనిలో నిరాసక్తంగా, మందకొడిగా ఉంటారు. పైగా పగటిపూట నిద్ర ముంచుకొస్తుంటుంది. ఏ పనీ సరిగా చేయలేరు. చాలినంత నిద్రపోకుండా వాహనాలు, ఇతర మోటార్లు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. సరైన నిద్రలేకపోతే పిల్లల్లో ఏకాగ్రత కొరవడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
నిద్ర కూడా వయసును బట్టి మారుతుంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలు దాదాపు 18 గంటలకు పైగా పడుకుంటే, తొంభై ఏళ్ల వృద్ధులు రోజుకు మూడు నాలుగు గంటలే పడుకుంటారు. వయసు పెరుగుతున్నకొద్దీ నిద్రపోయే సమయం తగ్గుతుంటుంది. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం 3 నుంచి 5 ఏళ్ల పిల్లలు 13 గంటల వరకు నిద్రపోతారు. 13 నుంచి 18 ఏళ్ల పిల్లలు 10 గంటలు నిద్రపోతారు. 18 నుంచి 60 ఏళ్ల వరకు ఏడెనిమిది గంటలు నిద్రపోతారు.