ఎపిలో వ్యవసాయానికి సాంకేతిక దన్ను : ఇ- క్రాపింగ్ సిస్టం, జియో ఫెన్సింగ్ సిస్టం

0
129

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం ఆధునికతను సంతరించుకునేలా సిఎం జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ మొదలుపెట్టారు. మంగళవారం వ్యవసాయం పై జరిపిన సమీక్ష సమావేశంలో ఆయన కీలకమైన విషయాలను లేవనెత్తారు. పలు ఆసక్తికరమైన విధానాలను ప్రకటించారు. సిఎం జగన్ మాటల్లోనే…

ఇ–క్రాపింగ్‌ పై పూర్తిగా ధ్యాస పెట్టండి. ప్రతి అంశానికి ఇది ఒన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అవుతుంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ప్రొక్యూర్‌మెంట్, సున్నావడ్డీ పంటరుణాలకు ఇ–క్రాపింగ్‌ అనేది ఒన్‌స్టాప్‌ సొల్యూషన్‌ అవుతుంది. రైతు భరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌(ఆర్బీయూడీపీ) యాప్‌ను కూడా తీసుకువస్తున్నాం. రైతు దగ్గర నుంచి ఆర్బీకేల వద్ద బయో మెట్రిక్‌ ఇ–కేవైసీని తీసుకోవాలి. ఇ– క్రాపింగ్‌కు సంబంధించి భౌతిక రశీదుకూడా ఇవ్వాలి. సరైన రశీదులు ఇవ్వకపోతే.. రైతులకు నష్టం జరుగుతుంది. ఇలాంటి సమస్యలను తీర్చడానికి భౌతిక రశీదులను ఇవ్వాలి. దీనిపై రైతు సంతకం, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సంతకం ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు ఈ రశీదుద్వారా క్లెయిమ్‌ చేసుకోవడానికి రైతు వద్ద ఒక ఆయుధంలా ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి.

ఇ– క్రాపింగ్‌ తో పాటు జియో ఫెన్సింగ్ ను కూడా తీసుకొస్తున్నాము. ప్రతి పంటను జియో ఫెన్సింగ్‌ చేస్తున్నాం. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా, నష్టం జరకుండా ఇది తోడ్పాటు అందిస్తుంది. వీటికి అత్యంత ప్రాధాన్యత కల్పించాలి. ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి. సీజన్‌లతో సరిపెట్టకుండా.. రైతు ఏ సమయంలో పంట వేసినా.. దాన్ని ఇ– క్రాప్‌ చేయాలి. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లో ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిగా మార్గనిర్దేశం చేయండి. రైతు సాగు చేసిన భూమికి ఎలాంటి పత్రాలు లేకపోయినా సరే ఇ–క్రాప్‌ చేయాలి. ఎలాంటి పత్రాలు ఇవ్వకపోయినా సరే ఇ–క్రాపింగ్‌ చేయండి. రైతు పంట వేస్తే చాలు.. దాన్ని ఇ– క్రాపింగ్‌ చేయండి. కనీసం 10 శాతం ఇ–క్రాప్‌ బుకింగ్స్‌ను కలెక్టర్‌ మానిటర్‌ చేయాలి. వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు 20 శాతం ఇ–క్రాప్‌ బుకింగ్స్‌ తనిఖీ చేయాలి. మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు 30 శాతం ఇ– క్రాపింగ్‌ను పర్యవేక్షణ చేయాలి. రైతుకు శ్రీరామ రక్షగా ఇ–క్రాపింగ్‌ నిలుస్తుంది. రైతుకు అన్యాయం జరగకుండా, మోసాలు జరకుండా నివారిస్తుంది.

వ్యవసాయ సలహా మండలి సమావేశాలు జరగాలి. పంటల ప్రణాళికపై కచ్చితంగా సమావేశాలు నిర్వహించాలి. ఆర్బీకే స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో ఈ సమావేశాలు నిర్వహించాలి. ఖరీఫ్‌ సన్నద్దత, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, క్రాప్‌ప్లానింగ్‌ తదితర అంశాలపై కచ్చితంగా వ్యవసాయ సలహామండలి సమావేశాలు జరగాలి. ఏ వెరైటీలు పండించాలి? ఏ వెరైటీలు పండించకూడదన్నదానిపై పంటల ప్రణాళిక ద్వారా నిర్ణయించాలి. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద వరిసాగు చేపట్టకుండా చూడాలి. దీనిపై రైతులకు అవగాహన కలిగించాలి. ప్రత్యామ్నాయ పంటలసాగువైపు ప్రోత్సహించాలి.