అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో వాహనసేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ప్రజలను రంజింపజేసేవారే రాజులు. అనంతవిశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీనివాసుడు కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అంతేగాక పాలకులు భగవత్సేవాపరులు కావాలని సర్వభూపాల వాహనసేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు.
కాగా సాయంత్రం 6.30 నుండి రాత్రి 7 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ గోపాల కృష్ణరెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.