రైతుబంధు నిధుల పంపిణీ : నాలుగో రోజూ ఆ జిల్లానే టాప్

0
114

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు నిధుల పంపిణీ కొనసాగుతోంది. ఈనెల 15న మొదలైన నిధుల పంపినీ నేడు నాలుగోరోజుకు చేరుకుంది. తొలిరోజు ఒక ఎకరం భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు డబ్బును వారి వారి ఖాతాల్లో జమ చేశారు. రెండో రోజు రెండెకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ డబ్బును జమ చేశారు. మూడో రోజు మూడెకరాల లోపు ఉన్న రైతులందరికీ డబ్బు బదిలీ చేశారు.

నాలుగో రోజైన గురువారం నాలుగు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులందరి ఖాతాల్లో నగదు బదిలీ చేశారు. రేపు శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1153.50 కోట్లు జమకానున్నాయి. తొలి మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జమ అయ్యాయి.

నాలుగో రోజు కూడా నల్లగొండ జిల్లాకే అత్యధికంగా రైతుబంధు పథకం కింద డబ్బు పంపిణీ జరిగింది. గురువారం నాడు నల్లగొండ జిల్లాకు చెందిన 53,381 మంది రైతులకు 1,82,542 ఎకరాలకు గాను రూ.91.27 కోట్లు డబ్బు పంపిణీ చేపట్టారు.

నాలుగో రోజు అత్యల్పం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2300 మంది రైతులకు గాను 7212 ఎకరాలకు 36.05 లక్షలు మాత్రమే పంపిణీ అయ్యాయి. మొత్తం నాలుగు రోజులలో రైతుబంధు కింద రైతుల ఖాతాలలో జమకానున్న రూ.4095.77 కోట్లు.

కరోనా టైంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయరంగమే : నిరంజన్ రెడ్డి

కరోనా విపత్తు సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయ రంగమే అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 60 శాతం మంది ప్రత్యక్ష్యంగా, మరో 20 శాతం మంది పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగం బాగుండాలని ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగానికి చేయూత నిస్తున్నారని చెప్పారు. రైతుబంధు, రైతు భీమా, ఉచిత కరంటు సరఫరాతో పాటు వంద శాతం పంటల కొనుగోళ్లతో రైతులకు అండగా నిలుస్తున్నారు. అందుకే కరోనా విపత్తులోనూ గత వానాకాలం, మొన్న యాసంగిలో కలిపి రూ. 14656.02 కోట్లు, ఈ వానాకాలంలో రూ.7508.78 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతుబంధు, ఉచితకరంటు , రైతుభీమా పథకాలతో తెలంగాణలో సాగు దశ – దిశ మారిందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.