మోడ్రన్ గొర్రెల ఫారాలు రావాలి : కె.యూ ప్రొఫెసర్ గడ్డం క్రిష్ణ

0
33

గొర్రెల పెంపకందార్లు నాయకులుగా ఎదుగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ప్రొఫెసర్ గడ్డం క్రిష్ణ పిలుపునిచ్చారు. గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(GMPS) ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో జరుగుతున్న రాష్ట్ర క్లాసులలో భాగంగా బుధవారం “నాయకత్వ లక్షణాలు” అనే అంశంపై కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ గడ్డం క్రిష్ణ బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యమైన అంశాలు…

సమాజంలో గొర్రెల కాపరులు ఆదిమకాలం నుండి నేటివరకు అడవినే ఆధారం చేసుకుని, జీవాలను మేపుకుంటూ సమాజానికి బలవర్ధకమైన మాంసాన్ని అందిస్తున్నారు. అర్ధ సంచారులుగా జీవనం కొనసాగిస్తూ ప్రభుత్వాలు చేసే చట్టాలు, వాటి అమలు తీరు, జరుగుతున్న దోపిడి అర్ధం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారు. నిత్యం మూగ జీవాలను ప్రేమిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ చదువుకు దూరమయ్యారు. పాలకులు మాత్రం వీరిని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ నిత్యం మోసం చేస్తున్నారు.

వీరి వృత్తికి నష్టం జరిగే అనేక చట్టాలను చేస్తున్నారు. యురేనియం పేరుతో నల్లమల లాంటి అడవులను ధ్వంసం చేసి రోడ్డున వేయాలని చూస్తున్నారు. అటవీ అధికారుల వేధింపులు పెరిగాయి. సకాలంలో మేత, వైద్యం, నీరు అందటంలేదు. సామాజిక అణిచివేతకు గురవుతున్నారు. ఇప్పటికీ ఉత్తర తెలంగాణలో అనేక గ్రామాల్లో VDC ల పేరుతో గ్రామ వెలివేతలను అనుభవిస్తున్నారు. వీరి సంక్షేమానికి ప్రభుత్వాలు పెట్టే పథకాలలో కూడా అవినీతి, దోపిడీ జరుగుతున్నది. ఇటీవల గొర్రెల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోవడం కళ్లారా చూస్తున్నాం.

GMPS ఆధ్వర్యంలో గొర్రెల కాపరుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించడం అభినందనీయం. గొప్ప సేవాగుణం  కలిగిన ఈ వృత్తి కుటుంబాల నుండి నాయకులుగా ఎడిగినప్పుడు తమ హక్కుల సాధన కోసం మరిన్ని పోరాటాలు నిర్వహించడంతోపాటు, సమాజానికి వీరే పాలకులైతే మరింత ఆదర్శవంతంగా సేవ చేస్తారు. వృత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి సాధించాలి. మోడ్రన్ గొర్రెల ఫారాలు నెలకొల్పి మాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి పరిపాలనా వ్యవస్థలో భాగస్వాములను చేయాలి. కులం మతం లాంటి అన్ని విషయాలపట్ల అవగాహన పెంచుకొని సమసమాజ స్థాపనకు కృషి చేయాలి.

ఈ ఆన్ లైన్ క్లాసులకు మేకల నాగేశ్వరరావు ప్రిన్సిపల్ గా వ్యవహరించగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.జంగయ్య, ఉడుత రవిందర్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు బొల్లం అశోక్, దయాల నర్సిహ్మ, అవిశెట్టి శంకరయ్య, కె.లింగయ్య, జాయ మల్లేష్, పయ్యావుల మల్లయ్య, కె. యాకయ్య, శాతవేని రమేష్, గౌర శ్రీశైలం, కాల్వ సురేష్, సందవేణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.