అశ్రునయణాలతో, బరువెక్కిన హృదయాలతో పుట్టి, పెరిగిన ఊరికి వీడ్కోలు

0
107

తెలంగాణలో మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భాగంగా ముంపు గ్రామాల్లో ఏటిగడ్డ కిష్టాపూర్ కూడా ఒకటి. ఆ గ్రామస్తులు ఇప్పుడు కన్న ఊరిని వదిలి వెళ్లిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాల్గొన్న చంద్రశేఖర్ అనే యువకుడు కన్న ఊరిని వదిలి వెళ్తూ… తాను పడే తపనను ఫేస్ బుక్ లో తన వాల్ మీద రాసుకున్నాడు. ఆ వ్యాసం యదాతదంగా All Time Report పాఠకుల కోసం దిగువన ఇస్తున్నాము.

2001 లో కేసిఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కొన్ని రోజులకు నేను ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు నడిపే ఓ కార్పొరేట్ కళాశాలలో చేరడం జరిగింది. అక్కడ దాదాపు టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా ఆంధ్రవాళ్లే ఉండేవారు. నన్ను ఎక్కడనుండి వచ్చావ్ అంటే సిద్దిపేట అని కొద్దిగా గర్వంగానే చెప్పుకునే వాడిని. అప్పట్లో కేసిఆర్ స్పీచ్ లన్నీ ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ ఎట్లా దోపిడీకి గురౌతుంది అని సాగుతూ వ్యంగ్యంగా, ఊపు కోసం కొన్ని పరుష పదాలు, పరుష ఉపన్యాసాలు ఆంధ్ర వాళ్ళమీద, వాళ్ళ జీవన శైలి మీద గట్టిగానే దంచేవాడు. అది అక్కడున్న వాళ్ళని బాధించేది కావొచ్చు. ఆ బాధనంత సిద్దిపేట అని చెప్పగానే కొంచం నా మీద వెళ్లగక్కే వారు. చిన్నప్పటి నుండి రైతుల కష్టాలు చూస్తూ పెరిగిన నాకు తెలంగాణ స్వరాష్ట్రం కావాలని బుద్దితెల్సినప్పటి నుండి ఉండేది. అందువల్ల వాళ్ళతో గట్టిగానే వాదిస్తూ,వారిస్తూ, కేసిఆర్ ని సపోర్ట్ చేస్తూ ఉండే వాడిని.

ఇలాంటి వాదనలు తెలంగాణ వచ్చేవరకు వివిధ దశల్లో జరుగుతూనే ఉండే. చాలా మందికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకత వివరించడానికి అస్సలు వెనకడుగు వెయ్యలేదు. కొందరు నా వాదనకు అనుకూలంగా మారినవారు ఉన్నారు, ఎద్దేవా చేసినవాళ్ళు ఉన్నారు. కని నా పని మాత్రం తెలంగాణ వచ్చేవరకు అస్సలు ఆపలేదు. గొప్పగా చెప్పడం లేదు బట్ ఏదో ఉడతా సహాయం గా చుట్టుపక్క వాళ్ళకి చెప్పడం, నాకు తెల్సిన సోషల్ మీడియాలో రాస్తూనే ఉండేవాడిని…ఎంతో మంది అమరుల త్యాగాల వలన, కేసిఆర్, కోదండరాం గార్ల సారథ్యం లో తెలంగాణ సమాజం పోరాటం వలన తెలంగాణ సాదించుకున్నాం.

తెలంగాణ వచ్చిన ఆనందం ఎక్కువ రోజులు ఏం ఆగలేదు,  మల్లన్నసాగర్ అనే బండని మా ఊర్ల మీద వేశారు. అప్పటికే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ సంబంధించి కాలువ మా పక్కనే పోతుండడం వలన మాకు నీళ్లు వచ్చి, మా పంటపొలాలు పచ్చగా మారుతాయి అనుకునెలోపే మల్లన్నసాగర్ భయం స్టార్ట్ అయ్యింది..పాలకులు మనవాళ్లే మనకు అండగా ఉంటారు అనుకుని ప్రాజెక్ట్ కోసం భూములు త్యాగం చెయ్యేడానికి రెడీ అయ్యాం…ఇచ్చాం…కానీ మన అనుకున్న పాలకుల నుండి ఆశించిన ప్రోత్సాహం కానీ, న్యాయం కానీ జరిగిందా అంటే ఏమో ఇప్పట్లో అయితే నేనేం చెప్పలేను.

ఇంకా రాయాల్సింది చాలా ఉంది…టైం వచ్చినప్పుడు పక్కా రాస్తా….!!!!