సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి తెలిసిన తాంత్రిక పూజలు ఇంకెవరికీ తెలియదని అన్నారు. మా దగ్గర లోక్ తాంత్రిక విద్య మాత్రమే ఉందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సైతం దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను ఆగం చేసింది బీజేపీ అనీ.. అగ్నిపథ్ పేరిట దేశ సైనికుల ఉసురు పోసుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ చేసిన ఒక్క మంచి పనినైనా మునుగోడు ప్రజలకు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు జరిగేది మునుగోడు ఉప ఎన్నిక కాదనీ.. మునుగోడు ప్రజల ఆత్మ గౌరవ ఎన్నికలని మంత్రి అన్నారు. ప్రజల ఆత్మ గౌరవం గెలవాలో లేక రాజగోపాల్ రెడ్డి ధనం గెలవాలో తేల్చుకోవాలన్నారు. బీజేపీ విమానాలు కొనిచ్చినా, మునుగోడు ప్రజల అభివృద్ధికే పట్టం కడతారని మంత్రి జోస్యం చెప్పారు.