హైదరాబాద్ లో బోనాల పండుగ ఇలా జరుపుకోండి : మంత్రి తలసాని

0
97

తెలంగాణ రాష్ట్ర పండుగ ఆషాడమాసం బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD)లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై  ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,  ఎమ్మెల్సీలు ప్రభాకర్, సురభి వాణిదేవి,ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, సాయన్న, సుభాష్ రెడ్డి, రాజసింగ్, డిజిపి మహేందర్ రెడ్డి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ట్రాన్స్ కో సిఎండి రఘుమారెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, టూరిజం ఎండీ మనోహర్, కల్చరల్ డైరెక్టర్ హరికృష్ణ, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్, జూ పార్క్ క్యూరేటర్ బాబు, గోల్కొండ, సికింద్రాబాద్, అంబర్ పేట, లాల్ దర్వాజ, కార్వాన్, అక్కన్న – మాదన్న దేవాలయాలు, ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యుల తో పాటు పలు ప్రాంతాలకు చెందిన వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు, బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాల ఉత్సవాలను నిర్వహించ లేకపోయినట్లు వివరించారు. ఈసంవత్సరం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల అలంకరణ, పూజల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేస్తుందని, ఏర్పాట్ల కోసం 60 కోట్ల రూపాయల ను కేటాయించినట్లు తెలిపారు. నగరం నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లను చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఉత్సవాలను భక్తులు వీక్షించే విధంగా ప్రధాన ప్రాంతాలలో ఎల్ఇడి స్క్రీన్ లను ఏర్పాటు చేయడం చేస్తున్నట్లు చెప్పారు. బోనాల ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని 3 లక్షల మందికి సరిపడా మాస్క్ లు, శానిటైజర్లను  తానూ వ్యక్తిగతంగా అందజేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆయా ఆలయాల వద్ద భక్తుల క్యూ లైన్ ల కోసం భారికేడ్ల ను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ లను అందుబాటులో ఉంచాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఆలయం వద్ద ఖచ్చితంగా శానిటై జర్లను అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ఆలయాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఆయా ఆలయాల వద్ద మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ లను ఏర్పాటు చేసి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందని, మొబైల్ టెస్టింగ్ సెంటర్ లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు. గోల్కొండ, బోనాల ఉత్సవాల కు విస్తృత ప్రచారం కల్పిస్తూ బస్సులపై ప్రచార పోస్టర్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసి ఎండీ సునీల్ శర్మ ను మంత్రి కోరారు.

బోనాల సందర్భంగా 189 దేవాలయాల వద్ద కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ తదితర 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆయా ఆలయాల పరిసరాలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి వ్యర్ధాలు, చెత్తను తొలగించాలని, డ్రైనేజి లీకేజీ లు లేకుండా చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కు ఆయా శాఖల అధికారులు సంబంధిత ఆలయ కమిటీ సభ్యుల సమన్వయం చేసుకొని ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగలను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పండుగల కోసం నిధులు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరుగుతుందని చెప్పారు. బోనాల ఉత్సవాలలో లక్షలాది మంది పాల్గొంటారని తెలిపారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోనాల ఉత్సవాల కోసం ఆలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు. డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆషాడ బోనాలకు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. బోనాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.