తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి : కేటిఆర్ తో హిమాన్షు ఒప్పందం

0
127
KTR

ఈవీ రంగంలో 2100 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చిన ట్రైటాన్(TRITON EV) ఈవీ
జహీరాబాద్ నిమ్జ్ లో తన ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత
ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం
తొలి ఐదేళ్లలో సుమారు 50వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు
తమ పెట్టుబడి కోసం తెలంగాణ ఎంచుకున్నందుకు రాయటానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు
ఈ పెట్టుబడితో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని మంత్రి ఆశాభావం

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఈవీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ – triton ఈవీ, ఈరోజు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో సూమారు 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. గురువారం ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖా మంత్రి కే.తారకరామారావుతో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ కు కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ తెలిపారు.

తమ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈమేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మంత్రి కేటీఆర్ కి తెలిపింది. పెట్టుబడుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ 2100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. ఈ మేరకు జహీరాబాద్ నిమ్జ్ లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది.

తెలంగాణ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్రైటాన్ -triton ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాష్ర్టంలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని, కంపెనీ పేర్కొన్న ప్రణాళిక ప్రకారం తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా, సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ర్టిక్ వాహానాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న సుమారు 2100 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 25 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఈవీ పాలసీ దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీ అన్నారు. టీఎస్ ఐపాస్ లో మెగా ప్రాజెక్ట్ కి లభించే అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం క్రమంగా ఈవీ రంగ పెట్టుబడులకు ఒక అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మరియు కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొంది.