సింగపూపూర్ హైకమిషనర్ హెచ్. ఈ సైమన్ వాంగ్ తన ప్రతినిధుల బృందంతో ఆర్థిక మంత్రి హరీశ్ రావును ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో సైమన్ వాంగ్ హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముందుకు దూసుకెళ్తోందని మంత్రి హరీశ్ రావు వారికి చెప్పారు. పెట్టుబడులకు హైదరాబాద్ నగరం అత్యంత అనువైన ప్రాంతమని చెప్పారు. డెటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పోరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ చెప్పారు. డెటా సెంటర్లకు హైదరాబాద్ అత్యంత అనువైనదని, ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు తమ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేశాయని మంత్రి వారికి వివరించారు. భౌగోళికంగా హైదరాబాద్ సురక్షితమైన నగరమని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫార్మా సిటినీ ఏర్పాటు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ హబ్ గా మారిందన్నారు. అంతే కాకుండా సోలార్ వంటి రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైందని చెప్పారు. ఏడాది పొడవునా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు మౌళికసదుపాయాలు, నాణ్యమైన విద్యుత్, రహదారులు, ఎయిర్ పోర్టు, శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్గధామమని వివరించారు.
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వారు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టని మంత్రి హరీశ్ రావు చెప్పారు. వంద మీటర్ల నుంచి 630 మీటర్ల ఎత్తులో తెలంగాణ ప్రాంతం ఉందని, గోదావరి నీటిని 630 ఎత్తు వరకు ఈ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం రంగం పరిశీలిస్తే ఏడున్నరేళ్ల కాలంలో సమూల మార్పులను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పెద్ద ఎత్తున రైతుల ఆత్మహత్యలు జరిగేవన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటల పాటు సరఫరా చేయడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, ఎకరానికి ఐదు వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు గాను పది వేల రూపాయలను పంట పెట్టుబడి అందజేసామన్నారు. రైతుల పంటను మద్ధతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. ఈ కారణంగా రైతుల ఆత్మహత్యలను పూర్తి స్థాయిలో తగ్గించినట్లు తెలిపారు. ఈ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ఉత్పత్తి చేసిందన్నారు. పంజా బ్ రాష్ట్రం దేశంలో ఇప్పటి వరకు నెంబర్ వన్ గా ఉండేదని, కాని ఆ రాష్ట్రం గత ఏడాది 2 కోట్ల 2లక్షల మెట్రిక్ టన్నులు పండించి రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. విద్యుత్ రంగంలోను స్వావలంబన సాధించామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని చెప్పారు. కేవలం పట్టణాలు,న గరాలే కాకుండా పల్లెలలోను సమూలంగా మార్పులు తెచ్చామన్నారు. మంచి రోడ్లు, చెత్త సేకరణ, డంప్ యార్టులు వంటి వసతులు అన్ని గ్రామాల్లో కల్పించామన్నారు. హరితహారం పథకం కింద మొక్కలు పెంచడం ద్వారా ఈఏడేళ్లలో 2 శాతం పచ్చదనం పెంచినట్లు తెలిపారు. ఈ దఫా పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణలోని పల్లెలను సందర్శించి అక్కడ నెలకొన్న మౌళిక సదుపాయాలు, గ్రామీణ ప్రజల జీవన విధానం పరిశీలించాలన్నారు. సిద్దిపేట జిల్లాను సందర్శించాలని కోరారు. ఈ భేటీ లో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ తో పాటు హైకమిషన్ సెక్రటరీలు సెన్ లిమ్, అమండా క్వెక్, సింగపూర్ కన్సోల్ జనరల్ ( చైన్నై ) పాంగ్ కాక్ టైన్, వైస్ కన్సోల్ జనరల్ అబ్రహాం పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి హరీశ్ రావు వారికి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.