తెలంగాణ సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాంత్రికుడు సలహా మేరకే టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చారంటూ ఆరోపణలు గుప్పించారు. తాంత్రికుడు సలహా మేరకే కేసీఆర్ సచివాలయానికి వెళ్లటం లేదన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో నిత్యం నల్లపిల్లితో క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ తనకు ఓ స్వామిజీ చెప్పినట్లు వివరించారు. కేసీఆర్ స్వలాభం కోసం ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ పేరును మార్చటానికి పేరు పెట్టింది కూడా తాంత్రికుడేనని స్వామీజీ చెప్పారన్నారు. కేసీఆర్‌కు ప్రజల మీద, దేవుడు మీద నమ్మకం లేదనీ.. అందుకే దయ్యాల పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారనీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తాంత్రికుడు సలహా మేరకే పాత సచివాలయాన్ని కూల్చివేసి.. ప్రజల సొమ్ముతో కొత్త సచివాలయాన్ని కడతున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ఫాంహౌస్‌లో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయంపై కేసీఆర్ నోరు మెదపలేదనీ.. ఆ కేసు ఏమయ్యిందో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కోసం, తన కుటుంబం కోసం కేసీఆర్ ఎటువంటి పనులు చేయటానికైనా సిద్ధంగా ఉన్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.