మెట్రో రైల్ సేవలు మరో గంట పొడిగించండి : సిఎస్ సూచన

0
41

ప్రయాణికుల సౌకర్యార్థం లాక్ డౌన్ రిలాక్సేషన్ సమయంలో నడుపుతున్నమెట్రో రైల్ సర్విస్ లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉదయం పరిశీలించారు.

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్.వి.ఎస్ రెడ్డి, ఎల్ అండ్ టి. ఎం.ఆర్.హెచ్.ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.బి. రెడ్డితో కలిసి ఖైరతాబాద్ స్టేషన్ నుండి అమీర్ పేట్ మెట్రో ఇంటర్ చేంజ్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రయాణించారు. కోవిడ్ -19 నిబంధనల అమలుకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు.

మెట్రో రైలు సేవలు, భద్రతా చర్యలు మొదలైన వాటి గురించి ప్రయాణికులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. మెట్రోలో కల్పించిన సౌకర్యాలు, చేసిన భద్రతా ఏర్పాట్లను ప్రయాణీకులు అభినందించారు, కార్యాలయాలు / వ్యాపారాలు మూసివేసిన తరువాత సౌకర్యవంతంగా ఇంటికి చేరుకోవడానికి గాను మెట్రో రైలు సమయంను పొడిగించాలని ప్రధాన కార్యదర్శిని వారు అభ్యర్థించారు.

యాణీకుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, మెట్రో సేవలను మరో గంట లేదా అంతకంటే ఎక్కువ పొడిగించాలని ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఎల్ అండ్ టి. ఎం.ఆర్.హెచ్.ఎల్ మేనేజింగ్ డైరెక్టర్లకు సూచించారు. ప్రతి దిశలో చివరి రైళ్లు ఇప్పుడు ఉదయం 11.45 గంటలకు బయలుదేరుతున్నాయి. మంగళవారం నుండి ప్రతి దిశలో చివరి రైళ్లు మధ్యాహ్నం 1 గంటలకు టెర్మినల్ స్టేషన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు చివరి స్టేషన్లకు చేరుకుంటాయి. కాగా గతంలో మాదిరిగానే మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ల నుండి ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతుంది.

ఈ కోవిడ్ సమయంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు అందిస్తున్న సేవలు మరియు భద్రతా ఏర్పాట్లపై మేనేజింగ్ డైరెక్టర్లు ఇద్దరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభినందించారు.