మహిళలను ఎవరైనా వేధిస్తే 181 కి కాల్ చేయండి : మంత్రి కొప్పుల

0
38

మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రధాన్యం ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎవరైనా మహిళలను వేధింపులకు గురి చేస్తే 181 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. గురువారం పెద్దపల్లిలో నిర్మిస్తున్న నూతన సఖి కేంద్ర భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.45 లక్షల వ్యయంతో సఖీ కేంద్రాన్ని పెద్దపల్లిలో ఎర్పాటు చేస్తున్నామని, 6 మాసాల్లో భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, దీనికి సంబంధించి ప్రభుత్వం మహిళా హెల్ప్ లైన్ 181 ను ప్రారంభించిందని అన్నారు. మహిళల అక్రమ రవాణాను నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గృహ హింసలు, భౌతికంగా, మానసికంగా క్రుంగిపోయి, నిరాశ, నిస్పృహలతో బతుకు భారంగా వెళ్ళదీస్తున్న మహిళల జీవితాలో కొత్త వెలుగులు నింపడానికి సఖి కేంద్రం పని చేస్తుందన్నారు. కుటుంబ సభ్యుల నిరాదరణకు గురైనవారు, కుటుంబ కలహాలతో విడిపోయినవారు, జైలు జీవితం గడిపి ఆధారం లేనివారికి, వ్యభిచార వృత్తి విడిచిన వారికీ, లైంగిక, వరకట్న వేదింపులకు గురైనవారికి, హెచ్.ఐ.వి. ఎయిడ్స్ వంటి వ్యాధుల వల నిరాదరణ పొందిన వారు , ఇలా వివిధ సామజిక సమస్యలతో సతమతమవుతున్న వారు మానసికంగా, శారీరికంగా బలపడడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

అవసరమైన చట్టపరమైన, న్యాయ సలహాలు అందిస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వారిని స్వయం ఉపాధి వైపు శిక్షణ ఇచ్చి ఆర్ధికంగా స్థిరపరుస్తామని చెప్పారు. దీనికి ప్రజలు సహకరించాలని, మానసికంగా క్రుంగిపోయి, నిరాశ, నిస్పృహలతో ఉన్న స్త్రీల వివరాలు ఎవరికైనా తెలిస్తే స్వధార్ వారికీ సమాచారం అందించాలని కోరారు. మహిళల రక్షణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకారమందించాలని మంత్రి అభ్యర్థించారు.

వ్యవస్థ అనేది భయము భక్తీ ఉన్నపుడే బాగుంటుందని, పది మంది కలిసి పని చేస్తేనే సమాజ నిర్మాణం జరుగుతుందని, స్త్రీల రక్షణ కొరకు కూడా పది మంది కలిసి పని చేయాలని అన్నారు. గత సంవత్సరంలో 424 కేసులు వచ్చాయని వీటిని 261 కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించామని, మిగిలిన పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. మహిళలు వేదనతో సఖి కేంద్రానికి వస్తారని వారి సమస్యలకు వీలైనంతవరకు సత్వర పరిష్కారం అందించాలని, దానికోసం ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పోలీసు వారి సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు.

జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టమధు, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలైశ్వర్ ,ఈఈ పంచాయతీ రాజ్ మునిరాజు, పెద్దపల్లి తహసిల్దార్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.