గోసంర‌క్ష‌ణ కోసం టిటిడి కొత్త ప్రాజెక్టు

0
123

స‌నాత‌న ధ‌ర్మంలో ఎంతో వైశిష్ట్యం గ‌ల గోవుల సంర‌క్ష‌ణ కోసం నూత‌నంగా గోవిందుని గోప‌థ‌కం ప్రాజెక్టును ప్రారంభించామ‌ని, త్వ‌ర‌లో విధివిధానాలు తెలియ‌జేస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. గోవిందుని గోప‌థ‌కం ప్రాజెక్టుకు సంబంధించి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి నేతృత్వంలో టిటిడి బోర్డు నిష్ణాతుల‌ క‌మిటీ ఏర్పాటుచేసింది. ఈ క‌మిటీ మొద‌టి స‌మావేశం శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌మిటీ స‌భ్యులు దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి వారి అనుభ‌వాల‌ను ఈవోకు వివ‌రించారు.

స‌మావేశం అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడుతూ గో ఆధారిత ప‌దార్థాల‌తో స్వామివారి నైవేద్యం, ప్ర‌సాదం త‌యారు చేస్తామ‌న్నారు. పంచ‌గ‌వ్యాల‌తో త‌యార‌య్యే ఉత్ప‌త్తుల ద్వారా స‌మాజంలో గోవు ప్రాముఖ్య‌త‌ను పెంచ‌వ‌చ్చ‌న్నారు. గో ఆధారిత సేంద్రీయ వ్య‌వ‌సాయం ద్వారా మంచి దిగుబ‌డులు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని చెప్పారు. క‌మిటీ స‌భ్యులు ప‌లు అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించార‌ని, వారి సూచ‌న‌లు నిర్మాణాత్మ‌కంగా, స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా ఉన్నాయ‌ని తెలిపారు. ఈ క‌మిటీ స‌భ్యులు శుక్ర‌, శ‌నివారాల్లో గోశాల‌లను సంద‌ర్శించి ప‌లు అంశాల‌పై అధ్య‌య‌నం చేస్తార‌ని చెప్పారు.

ఈ స‌మావేశంలో టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, క‌మిటీ స‌భ్యులైన బోర్డు మాజీ స‌భ్యులు శ్రీ కె.శివ‌కుమార్‌, ఎం.విజ‌య‌రామ‌కుమార్‌, డాక్ట‌ర్ ఎం.శివ‌రామ్‌, డాక్ట‌ర్ జి.విజ‌య‌కుమార శ‌ర్మ‌, డాక్ట‌ర్ టి.ప‌ద్మాక‌ర‌రావు, జి.నాగేంద‌ర్‌రెడ్డి, డాక్ట‌ర్ ఉమాశంక‌ర మ‌హాపాత్రో, డాక్ట‌ర్ కె.శివ‌సాగ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.