టిటిడిలో ఉచిత సేవలకు మంగళం అనే వార్తలు అవాస్తవం

0
109

ఉచిత సేవలకు మంగళం అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు టిటిడిప ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ఇస్తున్నాం.. చదవండి.

భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికిందని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని టీటీడీ ఒక ప్రకటనలో ఖండించింది. ఈ వార్తల ఆధారంగా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరం. భక్తులకు అందిస్తున్న ఎలాంటి ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలకలేదని స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా వాస్తవాలను వివరిస్తోంది.

– టిటిడిలో 2020 మార్చికి ముందు తిరుమ‌లలోని ల‌డ్డూ కౌంట‌ర్లు, క‌ల్యాణ క‌ట్ట త‌ల‌నీలాలు స‌మ‌ర్పిచే భ‌క్తులకు టోకెన్లు ఇచ్చే కౌంట‌ర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ద‌ర్శ‌నం టికెట్లు స్కానింగ్ కౌంట‌ర్లు, తిరుప‌తిలోని ఎస్‌ఎస్‌డి కౌంట‌ర్లు, అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న కౌంట‌ర్లు కలిపి 176 కౌంటర్లు ఉండేవి.

– ఇందులో త్రిలోక్ ఏజెన్సీ 89 కౌంటర్లు, వివిధ బ్యాంకులు 40 కౌంటర్లు, లడ్డూ సేవకులు 18 కౌంటర్లు, 7 ఎఫ్ ఎం ఏజెన్సీ 29 కౌంటర్లు ( నగదుతో)నడిపారు.

– త్రిలోక్ సంస్థ మార్చి 2020కి ముందే వారి సేవలు ఉపసంహరించుకుంది. 29 కౌంటర్లు నడిపిన 7 ఎఫ్ ఎం ఏజెన్సీ కాంట్రాక్టు సమయం అయిపోయింది. నగదు లావాదేవీలు ఉన్నందున ఈ కౌంటర్లు నడపలేమని బ్యాంకులు వెనక్కు వెళ్లాయి. ఇదే కారణంతో శ్రీవారి సేవకుల సేవలు కూడా ఉపసంహరించాము.

– ప్రస్తుతం రెండు బ్యాంకులు మాత్రమే 16 లడ్డూ కౌంటర్లు నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాంకులు కూడా కౌంటర్లు తమ నుండి వెనక్కి తీసుకోవాలని టిటిడిపై ఒత్తిడి తెస్తున్నాయి.

– ఈ క్రమంలో తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు పారదర్శకంగా, మరింత నైపుణ్యంగా సేవలు నిర్వ‌హించాలని టిటిడి భావించింది.

– ఇందుకోసం ఐదు సార్లు టెండర్లు పిలవగా ఐదవ సారి బెంగళూరుకు చెందిన‌ కెవిఎం ఇన్‌ఫో అతి తక్కువ ధరకు టెండ‌రు వేసింది.

– గతంలో ఒక కౌంటర్లో ఒక షిఫ్ట్ కు రూ.12,345 ( జిఎస్టీ కాకుండా) ఉండగా, ప్రస్తుతం రూ 11,402 కే ( జిఎఎస్టీ కాకుండా) టెండరు ఖరారయ్యింది. ఈ టెండర్లు కూడా ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగింది.

– టిటిడి అవసరాలకు అనుగుణంగా కౌంటర్ల సంఖ్యను 176 నుండి 164కు తగ్గించింది.

– భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వృత్తి నైపుణ్యతకు సంబంధించి వీరికి శిక్షణ ఇచ్ఛాము.

– కౌంట‌ర్ల‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఈ కొత్త విధానం ద్వారా రోటేష‌న్ ప‌ద్ధ‌తిలో రెండు నెలకు ఒక సారి సిబ్బందిని మార్చే వెసులుబాటు ఉంది.

– భక్తుల విశాల ప్రయోజనాలు, మెరుగైన సేవల లక్ష్యంగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు అరకొరగా అర్థం చేసుకుని మీడియా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదు.
– పత్రికల్లో ప్రచురితమైన అసత్య వార్తల ఆధారంగా కొంత మంది వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం మానుకుని, విజ్ఞతతో మాట్లాడాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.