లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న ఆషాడ మాస కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తిరుమల వసంతమండపంలో విష్ణు అర్చనం ఆగమోక్తంగా జరిగింది. ఆషాడ మాస శుక్ల ఏకాదశి సందర్భంగా ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజుల్లో ఏకాదశి విశేషమైనది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో దక్షిణాయన పుణ్యకాలంలో ఆషాడ మాసం శుక్ల ఏకాదశికి ఘనమైన పురాణ వైశిష్ట్యం ఉంది. ఈరోజు పాల సముద్రంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై శయనిస్తారని, అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి నాడు భగవంతుని స్మరణ చేస్తే 10 సంవత్సరాలు స్మరించిన ఫలితం దక్కుతుందని పండితులు తెలిపారు.
పచ్చని తోరణాలు, పుష్పాలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన వసంత మండపంలో స్వర్ణపీఠంపై శ్రీ రుక్మిణీ సమేతంగా కృష్ణస్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం పురాణ పండితులు శ్రీ రామకృష్ణ శేషసాయి శయన ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. ఆ తరువాత అర్చకస్వాములు, వేదపండితులు పారమాత్మికోపనిషత్ లోని శ్రీకృష్ణ మూలమంత్రం, గాయత్రీ మంత్రాన్ని 24 సార్లు పఠించారు. పుష్పార్చన చేసి తులసీదళాలతో సహస్రనామార్చన చేపట్టారు. నివేదన, హారతులు సమర్పించి క్షమాప్రార్థన చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.