బిగ్ డైలమా : తెలంగాణలో జులై 1 నుంచి బడులు తెరుస్తారా? లేదా?

0
129

జులై 1వ తేదీ నుంచి అన్ని స్థాయిల్లో విద్యాసంస్థలు ఓపెన్ చేసుకోవచ్చని తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ… కరోనా పరిస్థితులు చూస్తుంటే జులై 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవడం అంత ఈజీ కాదని తెలుస్తున్నది.

కరోనా మూడో వేవ్ ప్రమాదం ఒకవైపు పొంచి ఉన్న తరుణంలో విద్యాసంస్థలు తెరిస్తే ఏ ఉపద్రవం వచ్చిపడుతుందోనని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా కరోనా మూడో వేవ్ చిన్నారుల మీదే చూపబోతుందంటూ వార్తలొస్తున్నందున స్కూల్స్ ఓపెన్ చేయడం దుస్సాహసమే అవుతుందంటున్నారు.

తాజాగా టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఆంధ్రప్రదేశ్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఆంధ్రాలో పరీక్షల కారణంగా ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఘాటుగా కామెంట్ చేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. దీంతో చేసేదేమీలేక ఎపి సర్కారు తోకముడిచింది. పరీక్షలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

ఈ సమయంలో తెలంగాణలోనూ స్కూళ్లు తెరవడం అంత సముచితం కాదని విద్యావేత్తలు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణలో విద్యాసంస్థల ఓపెనింగ్ విషయంలో హైకోర్టు సైతం సర్కారును తూర్పారబట్టింది. అసలు గ్రౌండ్ లెవల్ లో ఏరకమైన కసరత్తు చేశారని స్కూల్స్ ఓపెనింగ్ పై ప్రకటన చేశారని హైకోర్టు నిలదీసింది. అందరూ స్కూళ్లకు హాజరు కావాల్సిందేనా? ఆప్షన్లు ఇస్తారా అని హైకోర్టు అడిగిన ప్రశ్నకు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అడ్వొకెట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. ఏ ప్రాతిపధికన విద్యాసంస్థలు ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారని హైకోర్టు మొట్టికాయలు వేసింది. విద్యార్థులకు నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది.

ఈ పరిస్థితులను బేరీజు వేసుకుంటే కచ్చితంగా తెలంగాణ సర్కారు స్కూళ్ల ఓపెనింగ్ ప్రక్రియను వాయిదా వేసుకోక తప్పదని అంటున్నారు. సర్కారు చేసిన ప్రకటన వెనక్కు తీసుకోవచ్చని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల నిర్వహణ విషయంలోనే సర్కారుకు సుప్రీంకోర్టు క్లాస్ పీకిన నేపథ్యంలో అసలే నిత్యం పాఠశాలలు నడుపుతామంటే ఇంకా ఎలా వాయిస్తుందో అని అధికారులు భయపడుతున్నారు. దీన్నిబట్టి చూస్తే జులై, ఆగస్టు నెలల్లో కూడా విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు తప్పేలా లేవని అనిపిస్తోంది.