పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మానసిక ఒత్తిడి(Mental Stress)కి లోనవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం వారు మల్టీ టాస్కింగ్ చేయడం ప్రధాన కారణం అని అంటున్నారు. వర్కింగ్ ఉమెన్ పై ఈ మానసిక ఒత్తిడి చాలా అధికంగా ఉందట. రిలేషన్ షిప్ ఇష్యూస్, పిల్లల పెంపకం, ఆఫీస్ ఇష్యూస్ ఇలా అనేక రకాల బాధ్యతలు మోయడం వారికి మానసిక ఒత్తిడిని పెంచుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు సమాజంలో పురుషులకంటే స్త్రీలు తక్కువ అనే భావన వారిని పని ప్రాంతాల్లో, ఇంట్లో మరింత మానసిక అనారోగ్యానికి గురి చేస్తోందని వాదిస్తున్నారు.
అయితే స్త్రీలు మాత్రం తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో వెనుకబడి ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. పని ఒత్తిడిలో పడి వారి మానసిక ఆరోగ్యం పై దృష్టి పెట్టట్లేదని నిపుణులు చెబుతున్నారు. కాలక్రమేణా ఇది వారిని మరింత అనారోగ్యానికి కృంగదీస్తుందని హెచ్చరిస్తున్నారు. చాలామంది స్త్రీలు పనిలో పడి తమకు ఇష్టమైన పనులు చేయడానికి, తమపై తాము దృష్టి పెట్టడానికి సమయం కేటాయించడం లేదు. మహిళలు తమ మెంటల్ హెల్త్ కాపాడుకునే దిశగా కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయాలని వారు సూచిస్తున్నారు.
కాగా స్త్రీలు మానసిక ఒత్తిడి(Mental Stress) నుండి బయట పడేందుకు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలని చెబుతున్నారు నిపుణులు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని హెచ్చరిస్తున్నారు. రోజువారి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మానసిక నిపుణులు మూడు సులువైన చిట్కాలు చెబుతున్నారు. ఇవి క్రమం తప్పకుండా పాటిస్తే మహిళలు ఎల్లప్పుడూ మానసిక ఆరోగ్యంతో ఉంటారని సూచిస్తున్నారు.
1. మీ మానసిక ఆరోగ్యం పై డైరీ రాయండి
మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఒక పుస్తకంలో రాయండి. అప్పుడు మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు అనే భావన మీలో ఉండదు. మీ భావాలను వ్యక్తపరిచేందుకు ఒక సులువైన మార్గం పుస్తకం ద్వారా దొరుకుతుంది. ఏం చెబితే ఎవరూ ఏమనుకుంటారు అని మనం చాలా విషయాలు బయటకు చెప్పుకోము. కానీ డైరీలో మనకు ఏమనిపిస్తే అది నిర్మొహమాటంగా రాసేయొచ్చు. ఇలా చేయడం వలన మనలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. మనం చెప్పేది వినడానికి ఎవరూ లేరు అనే మనోవేదన దూరం అవుతుంది.
2. మీకోసం మీరు టైమ్ కేటాయించండి
చాలామంది మహిళలు తమ కోసం తాము సమయం కేటాయించరు. మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే కారణాల్లో ప్రధానమైనది వారు తమ పట్ల తాము కేర్ తీసుకోకపోవడం. ఇందుకు కారణం వారికి ఏకాంతంగా ఉండేందుకు తగిన సమయం దొరకకపోవడమే. వారి భావోద్వేగాలను రీసెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. తమ జీవితానికి ఏది బాగా మేలు చేస్తుంది? ఏది పని చేయదు అని తేల్చుకునేందుకు కూడా ఈ సమయాన్ని వారు ఉపయోగించుకోవచ్చు.
3. హెల్ప్ అడగడం నేర్చుకోండి
చాలామంది మహిళలు సమస్య ఉన్నప్పుడు సహాయం అడగడానికి మొహమాటపడుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. మహిళలు తమకు అవసరమని భావించినప్పుడు సహాయం కోరాలి. స్ట్రెస్ నుంచి ఉపశమనానికి అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. కుటుంబ సభ్యులు, సహోద్యోగుల నుంచి అవసరమైన సందర్భాల్లో సాయం పొందడంలో తప్పులేదు.
Read Also: హ్యాపీ లైఫ్ కోసం ఈ సిక్స్ రూల్స్ పాటించండి
Follow us on: Google News, Koo, Twitter