Alltimereport : తెల్లటి పళ్లు.. ప్రతి ఒక్కరి కల. చాలా మంది ఒప్పుకోకపోయినా ఇది నిజం. అందుకోసం చాలా మంది ఖరీదయిన టూత్‌పేస్ట్(Toothpaste)లు వాడతారు. రోజుకు వైద్యులు చెప్పారని రెండు పూటలా బ్రష్ కూడా చేస్తారు. కానీ చాలా మందికి పళ్లు తెల్లగా రావు. కొంచెం పసుపు రంగుతోనే ఉంటాయి. చాలామందికి పసుపు రంగు, కాఫీ, పొగాకు మరకలు సమస్యగానే ఉంటున్నాయి. దాంతో పాటుగా ప్రకటనలు చూూసి మన పళ్లపై ఉండే ఎనాబిల్ బలపడాలని ఒక మరో పేస్ట్ తీసుకుంటాం.
ఫ్రెష్ బ్రీత్ కోసమని ఇంకొకరు ఇంకో పేస్ట్ వాడతారు. పళ్ల ఆరోగ్యం కోసం ఇంకో పేస్ట్ ఇలా.. మార్కెట్‌లో ఉన్న అన్ని పేస్ట్‌లను ఒకదాని తర్వాత వాడతారు. మరి నిజంగానే మనం వాడుతున్న పేస్ట్ నిజంగా పళ్లను శుభ్రం చేస్తోందా? ఎనామిల్‌ను బలపరుస్తోందా? లేక కేవలం నురుగు, తాజాదనాన్నే ఇస్తోందా? పురాతన పళ్ల పొడుల నుంచి ఆధునిక ఫ్లోరైడ్, హైడ్రాక్సీఅపటైట్ వరకు టూత్‌పేస్ట్ ప్రయాణం, దాని వెనుక ఉన్న శాస్త్రం.. ఈ ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్తుంది.
1955లో కీలక టర్న్
వేల ఏళ్ల క్రితమే మనుషులు పళ్లను శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేకమైన పొడులను ఉపయోగించేవారు. గుడ్డు పెంకులు, ఎముకల బూడిద, ఖనిజాలతో తయారైన ఈ పొడుల నుంచి 19వ శతాబ్దంలో క్రీమ్ రూపంలోని టూత్‌పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. 1955లో అమెరికాలో ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ మార్కెట్లోకి రావడంతో దంత సంరక్షణలో కీలక మార్పు మొదలైంది. ఇండియానా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జోసెఫ్ ములర్, ఆయన పరిశోధనా బృందం అభివృద్ధి చేసిన స్టానస్ ఫ్లోరైడ్ ఫార్ములాపై జరిగిన క్లినికల్ పరీక్షల్లో పంటి కుళ్లు తగ్గినట్లు గుర్తించారు. 1960లో అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా దీనికి గుర్తింపు ఇచ్చింది.
హైడ్రాక్సీఅపటైట్ మార్కెట్ ఎంట్రీ
మరో ఆసక్తికరమైన ఆవిష్కరణ హైడ్రాక్సీఅపటైట్. ఇది పళ్లు, ఎముకల్లో సహజంగా ఉండే ఖనిజం. నాసా పరిశోధకుడు బెర్నార్డ్ రూబిన్ చేసిన క్రిస్టల్ పరిశోధనలు ఈ సాంకేతికతకు పునాది వేశాయి. జపాన్‌కు చెందిన సాంగి సంస్థ నాసా పేటెంట్‌ను పొంది 1980లో అపాడెంట్ పేరుతో తొలి హైడ్రాక్సీఅపటైట్ టూత్‌పేస్ట్‌ను విడుదల చేసింది.
మరి మంచి టూత్‌పేస్ట్‌లో ఏముండాలి?
దంత వైద్య పరిశోధనల ప్రకారం టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్ అత్యంత కీలకమైన పదార్థం. ఇది ఎనామిల్(Enamel)ను ఆమ్లాల దాడి నుంచి కాపాడటంతో పాటు ప్రారంభ దశలో కోల్పోయిన ఖనిజాలు తిరిగి చేరేందుకు సహాయపడుతుంది. సాధారణంగా పెద్దలకు 1,000–1,500 పీపీఎం ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్‌ను సిఫార్సు చేస్తారు. హైడ్రాక్సీఅపటైట్ కూడా ఖనిజాల పునరుద్ధరణకు ఉపయోగపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
రెండూ బెస్టే
2023లో జర్నల్ ఆఫ్ డెంటిస్ట్రీలో ప్రచురితమైన 18 నెలల రాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్‌లో 189 మంది పెద్దలపై హైడ్రాక్సీఅపటైట్, ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌లను పోల్చారు. పంటి కుళ్లు నివారణలో హైడ్రాక్సీఅపటైట్ పేస్ట్ ఫ్లోరైడ్ పేస్ట్‌తో పోల్చదగిన ఫలితాలు చూపించింది. 2024లో ప్రచురితమైన మరో సిస్టమాటిక్ రివ్యూ, మెటా అనాలిసిస్ కూడా దీనిపై మరిన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఫ్లోరైడ్‌పై ఉన్న దీర్ఘకాలిక పరిశోధనల స్థాయిని ఇంకా చేరాల్సి ఉంది.
కాఫీ మరకలు కష్టమే..
ఇక పళ్లు తెల్లగా మారేందుకు వాడే వైటెనింగ్ పేస్ట్(Toothpaste)లలో హైడ్రేటెడ్ సిలికా, కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి ఉపరితల మరకలను తొలగిస్తాయి. కానీ కాఫీ, టీ, పొగాకులోని రంగు పదార్థాలు ఎక్కువకాలం పేరుకుపోతే సాధారణ బ్రషింగ్‌తో పూర్తిగా పోవు. పైగా పంటి లోపలి పొరలో రంగు మారితే వైటెనింగ్ పేస్ట్ పనిచేయదు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం వైటెనింగ్ టూత్‌పేస్ట్‌లు ప్రధానంగా బయట మరకలను తొలగిస్తాయి. పంటి సహజ రంగును మార్చే బ్లీచింగ్‌కు హైడ్రోజన్ పెరాక్సైడ్, కార్బమైడ్ పెరాక్సైడ్ ఉపయోగిస్తారు.
పళ్లు అరిగిపోతున్నాయ్..
2024లో అమెరికన్ జర్నల్ ఆఫ్ డెంటిస్ట్రీలో పబ్లిష్ అయిన ఒక అధ్యయనంలో కాఫీ మరకలను తొలగించడంలో వైటెనింగ్ పేస్ట్‌లు సాధారణ పేస్ట్‌ల కంటే మెరుగైన ఫలితాలు చూపించాయి. అయితే ఎక్కువ రాపిడితో పంటి ఉపరితలంపై అరుగుదల కూడా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అందుకే ఎక్కువ గరుకుదనం ఉన్న పేస్ట్ మంచిదని భావించకూడదు.
టూత్‌పేస్ట్‌లోని ఎస్‌ఎల్ఎస్ అనే పదార్థం నురుగు రావడానికి ఉపయోగపడుతుంది. కొంతమందిలో నోటి పుండ్లు, చికాకు పెంచవచ్చు. కానీ ఇది ఎనామిల్‌ను నాశనం చేస్తుందని ఆధారాలు లేవు. అలాగే పొటాషియం నైట్రేట్ సెన్సిటివిటీని తగ్గించడంలో, జింక్ సమ్మేళనాలు నోటి దుర్వాసన నియంత్రణలో సహాయపడతాయి.
అయితే టూత్‌పేస్ట్ (Toothpaste) కొనేటప్పుడు బ్రాండ్, తెల్లటి పళ్ల ప్రకటనల కంటే అందులోని పదార్థాలు, వాటి మోతాదుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే టూత్‌పేస్ట్ ప్రారంభ దశలో ఖనిజాల నష్టాన్ని సరిచేయగలదు కానీ పూర్తిగా అరిగిపోయిన ఎనామిల్‌ను తిరిగి పెంచలేదు. గట్టిపడిన గారను తొలగించలేదు. ఏర్పడిన పంటి రంధ్రాన్ని పూడ్చలేదు. అందుకే తెల్లటి పళ్ల కంటే ఆరోగ్యంగా, బలంగా ఉండే పళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
Also Read : ఫ్రెండ్‌లా మాట్లాడుతున్నా తప్పేనా.. అసలేంటీ ఎమోషనల్ అఫైర్?
Follow Us On: Whatsapp


