మూగబోయిన గానకోకిల..25 వేల పాటలు..ఎన్నో అవార్డులు..మరెన్నో రికార్డులు

0
96

లెజెండరీ సింగర్ లతా మంగేశ్వర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుది శ్వాస విడిచారు. తన సింగర్ కెరీర్లో దాదాపుగా 25,000 కు పైగా పాటలు పాడినట్లు సమాచారం. ఆమె 1959లో తొలిసారిగా మధుమతి అనే సినిమాలోని ‘ఆజా రే పరదేశి’ అనే పాటకు గాను ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం జరిగింది. ఆ తరువాత 1963, 1966లో కూడా అదే అవార్డుల అందుకున్నారు. ఇక 1969లో ఆమెను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1972లో పరిచా అనే సినిమాలోని పాటలు పడినందుకు గాను తొలిసారిగా ఆమెకు భారత జాతీయ ఉత్తమ సింగర్ అవార్డు లభించింది. అదే అవార్డును ఆమె 1974, 1990లలో కూడా అందుకున్నారు. 1989లో భారత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మ విభూషణ్ అవార్డులతో పాటు భారతదేశ అత్యున్నత పురస్కారంగా చెప్పబడే భారత రత్న అవార్డును ఆమె 2001లో అందుకోవడం జరిగింది. 2008లో భారతదేశ 60వ స్వాతంత్రా దినోత్సవం సందర్భంగా అప్పటి ప్రభుత్వం ఆమెను లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది.

వీటితో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి 1966, 1977లో బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా అలానే 1997లో మహారాష్ట్ర భూషణ్ మరియు 2001లో కొత్తగా ప్రవేశపెట్టిన మహారాష్ట్ర రత్న అవార్డును అందుకున్న తొలి మహిళగా ఆమె గొప్ప రికార్డుని సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకున్న వాటితో పాటు మరెన్నో రాష్ట్రీయ పురస్కారాలు ఆమె సినీ కెరీర్లో ఉన్నాయి. అయితే తన పాటలకు గాను ఎన్ని అవార్డులు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల గుండెల్లో ఒక మంచి గాయనిగా తన పేరు నిలిచిపోవడం అనేది తాను ఎప్పటికీ చెప్పుకునే అవార్డు అని లతా మంగేష్కర్ తరచూ చెప్తుంటారు. ఈ విధంగా భారతీయ సినిమా ప్రపంచంలో గాయనిగా లతా మంగేష్కర్ ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అటువంటి గొప్ప మహిళ నేడు మనల్ని అందరినీ విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.