దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ అయినవాళ్లకు లేదా కావాల్సిన వాళ్లకు మధుర జ్ఞాపకంగా బహుమతులు ఇచ్చుకుంటారు. తాజాగా అక్షయ్ కుమార్(Akshay Kumar) కూడా ఇదే విధంగా దీపావళి కానుక ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే అక్షయ్ కుమార్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరికంటే.. అయోధ్య వానరసేనకు(Vanarasena). అయోధ్యలోని రామమందిరం చుట్టూ ఉండే కోతులకు దీపావళి పండగ సందర్భంగా ఆహారం అందించాడు అక్షయ్. మందిరానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగించకుండా ఉండేందుకు కోతులకు ఆహారం పెట్టాడు. బాలరాముడి మందిరం చుట్టూ ఆకలితో ఉన్న వానర సేన కోసం ఫీడింగ్ వ్యాన్‌ను పంపించారు.
ఇది తొలిసారి కాదు..
అయితే అక్కడున్న కోతులకు ఆహారం అందించడం అక్షయ్‌కు ఇది తొలిసారేమీ కాదు. గతంలో ఆయోధ్య రామ మందిరం ప్రారంభం అయినప్పటి నుంచి అక్షయ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. లక్షలాది మంది బాలరాముడిని దర్శించుకోవడానికి వస్తుంటారని, అలాంటి సమయంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, మూగజీవాల రక్షణ కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అక్షయ్. పట్టణ శివార్లలోని సురక్షిత ప్రాంతంలో దాదాపు 1200 కోతులకు ప్రతిరోజూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నాడు అక్షయ్.
అందుకే ఈ నిర్ణయం
‘‘అయోధ్యలో ఆహారం కోసం కోతులు పడుతున్న అగచాట్లు విన్నాక చాలా బాధ అనిపించింది. వాటి కోసం నా వంతు కృషి చేయాలని అనుకున్నాను. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. దీపావళి సందర్భంగా నా తల్లిదండ్రులకు నివాళులర్పిస్తూ.. వారి పేరిట వానరసేనకు ఆహారం అందించే ఏర్పాటు చేశాను. దీన్ని చూసి వాళ్లు ఎక్కడున్నా సంతోషిస్తారని ఆశిస్తున్నా’’ అని అక్షయ్(Akshay Kumar) చెప్పాడు.