తన కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో అల్లుడు ప్రణయ్ ను మామ మారుతీరావు కిరాతకంగా హత్య చేయించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వేరే కులం వ్యక్తిని కుమార్తె పెళ్లి చేసుకోవడంతో మారుతీరావు తట్టుకోలేకపోయాడు. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ప్రణయ్ కి, అమృతకు వార్నింగ్ ఇచ్చానని… ఎన్నిసార్లు చెప్పినా ప్రణయ్ వినలేదని విచారణలో తెలిపాడు మారుతీరావు. ఎలాగైనా అల్లుడిని చంపాలని భావించాడు.. అంతేకాకుండా సుపారీ గ్యాంగ్ తో తన కూతురికి ఎలాంటి హాని కూడా కలగకూడదని చెప్పేశాడు. ప్రణయ్ హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ తో పాటు ఇద్దరు సుపారీ కిల్లర్స్ ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న మారుతీరావు ఎన్నో సంచలన విషయాలు తెలిపారు. తన కూతరు అమృతను కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ ను తానే ఈ హత్య చేయించినట్టు మారుతీరావు పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు. తన కూతురుపై ప్రేమతోనే ఈ హత్య చేయించానని చెప్పాడు. తన కూతురి కన్నా సమాజంలో తన పరువే ముఖ్యమని భావించానని చెప్పాడు. తన కుమార్తెకు ఎలాంటి హాని కలగకూడదని సుపారీ గ్యాంగ్ కు ముందే చెప్పానని తెలిపాడు. ప్రణయ్ ని చంపించినందుకు తనకు ఎలాంటి బాధ లేదని చెప్పాడు.
ప్రణయ్ ను చంపేస్తే తాను పుట్టింటికి వచ్చేస్తానని తండ్రి భావించాడని అమృత చెప్పింది. తన ప్రేమ వ్యవహారం తెలిసిన వెంటనే బాబాయ్ శ్రవణ్ తనను డంబెల్ తో కొట్టాడనీ, కిందపడేసి తన్నాడని వెల్లడించింది. అప్పట్లో ప్రణయ్ తో మాట్లాడితే చంపేస్తానని తండ్రి కూడా బెదిరించాడని వాపోయింది. దీంతో తామిద్దరం హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ కు వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నామని అమృత తెలిపింది. వివాహమైన తర్వాత తమకు వేధింపులు కొనసాగాయని పేర్కొంది. తాను నెల తప్పినట్లు తెలియగానే వెంటనే అబార్షన్ చేసుకోవాలని తండ్రి మారుతీరావు ఒత్తిడి చేశాడని ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పవద్దని హెచ్చరించినట్లు అమృత మీడియాకు తెలిపింది. కానీ రెండు నెలల క్రితం తల్లికి ఈ విషయం చెప్పానంది. తన తల్లి అప్పుడప్పుడూ రహస్యంగా ఫోన్ లో మాట్లాడేదని పేర్కొంది.