బిగ్‌బాస్ వంటి రియాల్టీ షోలు ద్వారా ఏం సందేశమిస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎటువంటి సెన్సార్ లేకుండా ఈ రియాల్టీ షోలు ప్రసారం అవుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. బిగ్‌వాస్ వంటి ప్రదర్శనలకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని.. కేంద్ర హోం, సమాచార ప్రసార, మహిళ శిశు సంక్షేమ శాఖలతో పాటు సెట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్‌కు నోటీసులిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇదే తరహా అంశానికి సంబంధించి, దాఖలైన వ్యాజ్యంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజంలో ప్రస్తుతం సినిమాలు, టీవీ కార్యక్రమాలు కుటుంబ సభ్యులంతా కూర్చొని చూసేలా ఉన్నాయా అని ప్రశ్నించింది. కొట్టుకోవటం, తిట్టుకోవటం, రెచ్చగొట్టడం తప్ప, మంచి సందేశాలు ఇచ్చే ఒక్క కార్యక్రమమైనా ఉంటుందా అని నిలదీసింది. బిగ్‌బాస్ షోపై 2019లో దాఖలు చేసిన పిల్‌తో పాటు ప్రస్తుత పిల్‌ను జత చేసిన చేయాలని రిజస్ట్రీని ఆదేశిస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది.