జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన తాజాగా సినిమా ‘దేవర(Devara)’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవెంట్ రద్దుకు అసలు కారణం శ్రేయస్ మీడియనో మరెవరో కాదని.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు ఈ మాజీ మంత్రి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అసమర్థత కారణంగా ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయిందని చెప్పారు. ఈ ఈవెంట్ ఘనంగా నిర్వహించాలని మూవీ మేకర్స్, తమ అభిమాన హీరోను చూడాలని అభిమానులు ఎంతో దూరం నుంచి ఇక్కడకు వస్తే వీరి చేతకానితనం వల్ల వారిని ఉసూరుమనింపించారంటూ సెటైర్లు వేశారు కేటీఆర్.
‘‘బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం చిన్నచిన్న పండగలను కూడా మా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఘనంగా నిర్వహించేవారు. అది ఫార్ముల వన్ రేసింగ్, గణేష్ నిమజ్జనం, బోనాలు ఇలా ఈవెంట్ ఏదైనా అత్యంత అద్భుతంగా నిర్వహించాం. వీటిలో ఏ ఈవెంట్ నిర్వహించేటప్పుడు కూడా ఒక్క పౌరుడు కూడా ఇబ్బంది పడలేదు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను మళ్లించి అందరికీ సౌకర్యవంతంగా చూసుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఒక సినిమా(Devara) ఈవెంట్‌ను కూడా గ్రాండ్‌గు చేసుకోలేకున్నారు’’ అంటూ పంచులు పేల్చారు కేటీఆర్.