ఇండస్ట్రీలో థమన్ అంటే తెలియని వారుండరు. ఈయన ఎన్నో పాటలకు బిజిఎం అందించి ఆ పాటను సూపర్ హిట్ అయ్యేలా చేస్తాడు. ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కోసారి టైమ్ నడుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన 14 ఏళ్ళ తర్వాత ఇప్పుడు థమన్ టైమ్ నడుస్తుంది. మధ్యలో కూడా కొన్నిసార్లు రచ్చ చేసాడు కానీ ఇఫ్పుడు అయితే ఏకంగా దేవీని కూడా కాదని నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు.
అఖండ సక్సెస్ లో 50 శాతం థమన్ ఒక్కడే తీసుకున్నాడంటే మాములు విషయం కాదు. ఈ చిత్రంలో ఆయన కొట్టిన పాటల కంటే కూడా బిజిఎం అందరి చెవుల్లో మార్మోగిపోతుందనేది ఇనానమస్ టాక్. ఈ మధ్య కాలంలో థమన్ అందిస్తున్న సంగీతం మరో స్థాయిలో ఉంది. ప్రతీ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో వాయిస్తున్నాడు. అందుకే ప్రతి పాట సూపర్ హిట్ అవుతున్నాయి.
ఈ క్రమంలో మొన్నటి వరకు లక్షల్లోనే ఉన్న ఈయన పారితోషికం ఇప్పుడు కోట్లలోకి వెళ్లిపోయింది. నిజానికి ఎప్పుడో ఈయన పారితోషికం కోటి రూపాయలు దాటాలి కానీ కొన్ని పరిస్థితుల కారణంగా చిన్న సినిమాలకు తక్కువగానే తీసుకుంటున్నాడు థమన్. పెద్ద సినిమాల వరకు మాత్రం బాగానే వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద సినిమాలకు ఈయన 1.50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అనుకున్న టైమ్‌లో ఔట్ పుట్ ఇస్తాడు.. పైగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇస్తున్నాడు కాబట్టి నిర్మాతలు కూడా థమన్ అడిగినంత ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన చేతిలో 10 సినిమాలకు పైగానే ఉన్నాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమా.. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు థమన్.