కంగనా రనౌత్(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎమర్జెన్సీ(Emergency)’. ఈ సినిమాకు మొదలు నుంచి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. గతేడాది నవంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ 6న రిలీజ్‌కు రెడీ అవుతుండగా సెన్సార్ నుంచి, కోర్టు నుంచి చిక్కులు ఎదురయ్యాయి. దీంతో ఈ సమస్యలపై కంగనా తనదైన శైలిలో స్పందించింది. తన సినిమాపై ఎమర్జెన్సీ విధించారంటూ చురకలంటించారు. ‘‘నేనెంతో ఆత్మగౌరవంతో ఈ సినిమాను రూపొందించాను. కట్ చేయని ఫుల్ వెర్షన్‌ను రిలీజ్ చేయాలని నిశ్చయించుకున్నా. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. అన్‌కట్ వెర్షన్‌నే రిలీజ్ చేస్తాను’’ అని తన అభిప్రాయం తెలిపింది కంగనా.
‘‘నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. మన దేశం విషయంలో చాలా నిరాశగా ఉన్నాను. ఓటీటీలో హింస, అశ్లీలం వంటివి చూపినా అభ్యంతరం చెప్పరు కానీ నా సినిమా విషయంలో మాత్రం ఎక్కడలేని నిబంధనలు వెలికితీస్తున్నారు. ఓటీటీకి అంత స్వేచ్ఛ ఉంది. నా విషయానికి వస్తే నా సినిమాలో ఇందిరా గాంధీ(Indira Gandhi) హత్యను చూపించకూడదని, బింద్రన్‌వాలేను చూపొద్దని, పంజాబ్ అల్లర్లను కనుమరుగు చేయాలంటూ ఒత్తిడి వస్తుంది. ఇవేవీ చూపకపోతే ఇంక ఎమర్జెన్సీలో చూపడానికి ఏముంది? కొన్ని సినిమాలు తీయడానికి కొందరికి మాత్రమే సెన్సార్‌షిప్ ఉంటుంది’’ అని Kangana Ranaut వ్యాఖ్యానించింది.