ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అతడు తనపై కొంతకాలంగా పలుమార్లు వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో అవుట్ డోర్ షూటింగ్స్ జరుగుతున్న సమయంలో, నార్సింగ అక్కపురి టౌన్షిప్ నివాసంలో అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. కేసును నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్(Jani Master)పై ఐపిసి సెక్షన్ 376 (అత్యాచారం), క్రిమినల్ బెదిరింపు (506), స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు.