యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘ఆదిపురుష్(Adipurush)’ చిత్రం తెరకెక్కించడం మొదలుపెట్టిన నాటి నుంచి ఆ మూవీ దర్శకుడు ఓం రౌత్(Om Raut) నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆ చిత్ర టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఇవేం గ్రాఫిక్స్ అంటూ అతడిని నెటిజన్లు, విమర్శకులు ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తిరుమల పుణ్యక్షేత్రంలో అతడు ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదస్పదం అవుతోంది. ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం తిరుపతిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన చిత్రబృందం బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం నుంచి వెళ్తున్న క్రమంలో హీరోయిన్ కృతిసనన్(Kriti Sanon)కు దర్శకుడు ఓం రౌత్(Om Raut) హగ్ ఇచ్చి బుగ్గపై ముద్దుపెట్టాడు. దీంతో తిరుమల కొండపై రౌత్ వ్యవహరించిన తీరుపై హిందూ ధార్మిక సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన డైరెక్టర్, హీరోయిన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేం షూటింగ్ స్పాట్.. పిక్నిక్ స్పాట్ కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో తప్పుగా ప్రవర్తించిన ఇద్దరికి టీటీడీ నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తిరుమలలో హీరోయిన్‌కు ఓం రౌత్ ముద్దులు.. మండిపడుతున్న హిందూ సంఘాలు
-