ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా(Ilaiyaraaja) తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె భవతారణి కన్నుమూశారు. గురువారం ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. భవతారణి కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. దీనికోసం శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ లో భాగంగా అక్కడే ఉంటున్న ఆమె.. ఆరోగ్యం విషమించి మరణించారు. దీంతో ఇళయరాజా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సోదరులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా లతో పాటు భవతారణి(Bhavatharini) కూడా తండ్రి నుంచి సంగీత వారసత్వం తీసుకున్నారు. సింగర్ గా, సంగీత దర్శకురాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె తండ్రి ఇళయరాజా(Ilaiyaraaja) స్వరపరిచిన భారతి చిత్రంలోని “మయిల్ పోల పొన్ను ఒన్ను” పాటను పాడినందుకు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. రేవతి దర్శకత్వంలో 2002లో శోభన నటించిన మిత్ర, మై ఫ్రెండ్ చిత్రానికి భవతారిణి సంగీత దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత “అవునా” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. శిల్పా శెట్టి, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లు నటించిన ఫిర్ మిలేంగే సినిమాకి కూడా ఆమె సంగీతం అందించారు. 2012లో గ్రామ ఆధారిత ప్రాజెక్ట్ అయిన వెల్లచికి ట్యూన్‌లు స్వరపరిచేందుకు ఆమె ఎంపికయ్యారు.