Megastar Chiranjeevi honoured with indian film personality of the year 2022: గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ది ఇయర్ పురస్కారాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, పదేళ్ల విరామం తీసుకొని తిరిగి చిత్ర పరిశ్రమలోకి వచ్చినా అభిమానులు తనపై చూపించే అభిమానం తగ్గలేదనీ.. ఇంకా రెట్టింపు అయ్యిందని అన్నారు. తనను ఎంతో ఆదరిస్తున్న వాళ్లందరికీ రుణపడి ఉంటానని చిరంజీవి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానుల ప్రేమకు రుణపడి ఉంటానని అన్నారు. ఇక ఎప్పటికీ సినిమాల్ని వదిపెట్టను అని చిరంజీవి హామీ ఇచ్చారు.
మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శివ శంకర్ ప్రసాద్ అనే తనకు.. చిరంజీవి (Megastar Chiranjeevi) గా జన్మనిచ్చింది చిత్ర పరిశ్రమ అని చెప్పుకొచ్చారు. నా తల్లిదండ్రులకు, చిత్రపరిశ్రమకు ధన్యవాదాలు అని అన్నారు. సినీ పరిశ్రమలో ఉండటం తన అదృష్టమని చిరంజీవి అన్నారు. యువ హీరోలు తనకు పోటీ కాదనీ.. తానే వాళ్లకు పోటీ అని అన్నారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేసిన ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. గతంలో ఇటువంటి వేడుకల్లో పాల్గొన్నప్పుడు.. అప్పుడు దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫోటో కూడా లేదని బాధపడినట్లు చిరంజీవి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అవార్డు అందుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. చిత్రసీమలో కేవలం ప్రతిభే కొలమానం అని చిరంజీవి అన్నారు.
.