తేజ్ ఐ లవ్ యూ మూవీ రివ్యూ

తేజ్ ఐ లవ్ యూ మూవీ రివ్యూ

0
197

చిత్రం – తేజ్ ఐ లవ్ యూ
నటీన‌టులు : సాయిధ‌రంతేజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, జ‌య‌ప్ర‌కాశ్, ప‌విత్రా లోకేష్, పృథ్వీ త‌దిత‌రులు..
సినిమాటోగ్ర‌ఫ‌ర్ : ఐ ఆండ్ర్యూ
సంగీతం : గోపీసుంద‌ర్
నిర్మాత‌ : కే ఎస్ రామారావు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: క‌రుణాక‌ర‌ణ్

క‌రుణాక‌ర‌ణ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు ఓ ఊహ ఉంటుంది. ప్ర‌తీసారి ఈయ‌న ప్రేమ‌క‌థ‌తోనే వ‌స్తాడ‌ని తెలుసు. హీరో మారినా ఈయ‌న క‌థ‌లు అన్నీ ప్రేమ‌చుట్టూనే తిరుగుతుంటాయి. ఇప్పుడు కూడా సాయిధ‌రంతేజ్ తో తేజ్ ఐ ల‌వ్ యూ అంటూ చేసాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది..?

క‌థ‌:

తేజ్ (సాయిధ‌రంతేజ్) ఓ మ్యూజిషియ‌న్. హైద‌రాబాద్ లో ఫ్రెండ్స్ తో ట్రూప్ న‌డుపుతుంటాడు. ఉమ్మ‌డి కుటుంబంలోనే పెరిగిన తేజ్ చిన్న త‌ప్పు చేసి కుటుంబం నుంచి దూర‌మైపోతాడు. చెల్లి పెళ్లి ఫ్యామిలీ ఇష్టానికి విరుద్ధంగా చేస్తాడు తేజ్. ఆ త‌ర్వాత కుటుంబానికి దూర‌మైన స‌మ‌యంలోనే నందిని(అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్)ని చూస్తాడు. ఆ త‌ర్వాత ఆమెతోనే అనుకోకుండా ఓ చిన్న త‌ప్పు చేసి ఇరుక్కుపోతాడు. ఆ క్ర‌మంలోనే నందిని కూడా తేజ్ ను ల‌వ్ చేస్తుంది. ప్రేమ విష‌యం చెప్ప‌డానికి వ‌స్తున్న త‌న‌కు యాక్సిడెంట్ అవుతుంది.. ఆ త‌ర్వాత ఏమైంది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:

తొలిప్రేమ వ‌చ్చి 20 ఏళ్లైంది.. అంద‌రూ బ‌య‌టికి వ‌చ్చారు ఆ కిక్ లోంచి.. ఒక్క క‌రుణాక‌ర‌ణ్ త‌ప్ప‌.. సూర్యుడి చుట్టూ భూమి తిరిగిన‌ట్లు..
తొలిప్రేమ చుట్టూనే ఇంకా తిరుగుతూ ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికీ ఆ మ‌త్తులోంచి బ‌య‌టికి వ‌చ్చిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. క్లైమాక్స్ లో ఎయిర్ పోర్ట్ సీన్.. సెకండాఫ్ లో హీరోను గొప్పోన్ని చేసే ఓ సీన్.. ఫ‌స్టాఫ్ లో హీరో హీరోయిన్ మ‌ధ్య న‌డిచే అగ్రిమెంట్ ప్రేమ‌లు.. ఇలా తీసిన సీన్సే.. మ‌రిచిపోయి మ‌ళ్లీ తీస్తున్నాడు క‌రుణాక‌ర‌ణ్. తేజ్ ఐ ల‌వ్ యూ కూడా దీనికి మిన‌హాయింపేమీ కాదు. ఓ సీన్ బాలును గుర్తుచేస్తే.. మ‌రోటి డార్లింగ్ లో ఉంటుంది. ఇంకోటి ఎందుకంటే ప్రేమంట‌.. క్లైమాక్స్ తొలిప్రేమ‌.. ఇక్క‌డ మంచి విష‌యం ఏంటంటే.. ప‌క్క ద‌ర్శ‌కుల‌పై ఆధార‌ప‌డ‌కుండా..

అన్నీ త‌న సినిమాల్లోని సీన్సే మ‌ళ్లీ కాపీ కొట్ట‌డం. తేజ్ లో హీరోయిన్ అనుప‌మ‌కు మెమోరీ లాస్ ఉంటుంది.. సినిమా చూసిన త‌ర్వాత ఆ జ‌బ్బు కరుణాక‌ర‌ణ్ కు కానీ ఉందేమో అని భ‌య‌మేసింది ప్రేక్ష‌కుల‌కు. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు.. కానీ క‌రుణాక‌ర‌ణ్ ఓల్డ్ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్. తీస్తుంది రొటీన్ క‌థ అని తెలిసినా.. ఇంకాస్త రొటీన్ గా తెర‌కెక్కించాడు తేజ్ ఐ ల‌వ్ యూ. అక్క‌డ‌క్క‌డా కామెడీ వ‌ర్క‌వుట్ అయినా..

మొత్తంగా తేజ్ మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని రొటీన్ స్టోరీతో నీరు గార్చేసాడు క‌రుణాక‌ర‌ణ్. సాయిధ‌రంతేజ్ గురించి ఏం చెప్పాలి.. బ్రాండ్ ను కాకుండా అప్పుడ‌ప్పుడూ క‌థ‌ను న‌మ్మితే బాగున్ను. టైటిల్ తేజ్ ఐ ల‌వ్ యూ అంటున్నా.. ప్రేక్ష‌కులు సినిమా చూసిన త‌ర్వాత అన‌డానికి మ‌న‌సు రాదు. ఓవ‌రాల్ గా ఈ తేజ్.. పెన్ను క‌లిపిన ఓ ప్రేమ‌క‌థ‌.

న‌టీన‌టులు:

సాయిధ‌రంతేజ్ తొలిసారి పూర్తి ల‌వ‌ర్ బాయ్ గా బాగా చేసాడు. కానీ క‌థ కొత్త‌గా లేన‌పుడు ఈయ‌న ఎంత చేసినా లాభం ఉండ‌దు. తేజ్ పాత్ర‌లో బానే మెప్పించాడు ఈ హీరో. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా నందినిగా ఇమిడిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు సాఫ్ట్ గాళ్ గా క‌నిపించిన అను.. ఈ సారి మాత్రం కాస్త మాస్ ల‌క్ష‌ణాల‌తో న‌టించింది. హీరో పెద‌నాన్న‌గా జ‌య‌ప్ర‌కాశ్ బాగా చేసాడు. థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ కామెడీ అక్క‌డ‌క్కడా పేలింది. హీరో ఫ్రెండ్స్ గా జోష్ ర‌వి, వైవాహ‌ర్ష బాగున్నారు. మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేవాళ్లే.

టెక్నిక‌ల్ టీం:

భలేభ‌లే మ‌గాడివోయ్, నిన్నుకోరి లాంటి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చిన గోపీసుంద‌ర్ నుంచి రావాల్సిన ఔట్ పుట్ అయితే కాదు ఇది. అంద‌మైన చంద మామ పాట త‌ప్ప మిగిలిన‌వ‌న్నీ క‌నీసం గుర్తు కూడా ఉండ‌వు. సినిమాటోగ్ర‌ఫ‌ర్ ఆండ్ర్యూ ప‌నితీరు బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెట‌ర్ గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. కేఎస్ రామారావు ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌ర్శ‌కుడు చెప్పింది చేసాడు. ద‌ర్శ‌కుడిగా క‌రుణాక‌ర‌ణ్ మాత్రం మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. త‌న నుంచి ప్ర‌తీసారి తొలిప్రేమ లాంటి సినిమా ప్రేక్ష‌కులు ఆశిస్తున్నార‌ని అనుకుంటున్నాడేమో కానీ కాస్త ఆ ఊహ‌ల్లోంచి బ‌య‌టికి వ‌స్తే ఆయ‌న నుంచి కూడా మంచి సినిమాలు వ‌స్తాయ‌ని తెలుసుకుంటే బాగుండేది.

చివరిగా – ఈ సారి కూడా విన్నర్ అవ్వలేదు

రేటింగ్ – 1.5