మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున(Nagarjuna) పరువు నష్టం దావా వేశారు. రాజకీయాల కోసం సదరు మంత్రి తన కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ నాగార్జున.. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తన కుటుంబాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. అయితే సమంత, అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించాయి. అప్పటి నుంచే సినీ ప్రముఖలు సహా రాజకీయ పెద్దలు కూడా కొండ సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టడమే కాకుండా.. ఆమెనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం వేరే కుటుంబాన్ని పణంగా పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున పిటిషన్ దాఖలు చేయడం కీలకంగా మారింది.
ఇదిలా ఉంటే కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై సమంత, నాగార్జున మండిపడతారని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ వీరిద్దరూ కూడా ఈ సిచ్యుయేషన్‌ను చాలా కూల్‌గా డీల్ చేశారు. ఇంతకీ వారు ఎలా స్పందించారంటే.. రాజకీయంగా ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు తమను పావులుగా ఉపయోగించుకోవద్దని నాగార్జున మంత్రిని ఎక్స్ వేదికగా కోరారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండని అభ్యర్ధించారు. బాధ్యత కలిగిన మంత్రి హోదాలో ఉండి తమ కుటుంబం విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమన్నారు. తక్షణమే చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని నాగార్జున(Nagarjuna) కోరారు. ఇక సమంత(Samantha) ఎక్స్ వేదికగా స్పందించి విడాకులు తన వ్యక్తిగతమని చెప్పి ఊహాగానాలను మానుకోవాలని కోరారు. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పోరాడటానికి చాలా బలం కావాలని చెప్పారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.